విశాఖపట్నం : స్టీల్ ప్లాంట్ ఘటనా స్థలంలో కార్మికులతో మాట్లాడానని అన్నారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. సరైన భద్రతా ప్రమాణాలు పాటించలేదని వారు ఆవేదన వ్యక్తం చేశారని తెలిపారు. ప్లాంట్‌ను ఆధునీకరించడంలో యాజమాన్యం నిర్లక్ష్యం వహించిందని, దశాబ్దాల నాటి పాత పరికరాలు, యంత్రాలను మార్చకుండా వాడటం వల్లే ఇలాంటి పెను ప్రమాదాలు జరుగుతున్నాయని కార్మికులు ఆరోపిస్తున్నారు. నాకున్న సమాచారం ప్రకారం గత 36 ఏళ్ల స్టీల్ ప్లాంట్ కార్యాచరణ చరిత్రలో ద్రవ ఉక్కును మోసుకెళ్లే ల్యాడిల్ బకెట్ ఈ స్థాయిలో పేలిపోయి, ఇంత మంది ప్రాణాలు బలిగొన్న సంఘటన ఎప్పుడూ జరగలేదు. గతంలో చిన్నపాటి లీకేజీలు, ఆక్సిజన్ ప్లాంట్‌లో ఇతర ప్రమాదాలు జరిగినప్పటికీ, ఒక ల్యాడిల్ బకెట్ పేలిపోవడం ఇదే మొదటిసారి అని నిపుణులు చెబుతున్నారు. చైనా, ఫ్రాన్స్ వంటి విదేశీ ఉక్కు కర్మాగారాల్లో గతంలో కొన్ని పారిశ్రామిక ప్రమాదాలు జరిగిన దాఖలాలు ఉన్నాయి. కానీ, అక్కడ కూడా ఇంత భారీ ఎత్తున మరుగుతున్న ద్రవ ఉక్కు బకెట్ పేలిపోయిన సంఘటనలు నమోదు కాలేదు. ఈ రకమైన పేలుడు అత్యంత అరుదైనది. త్రిసభ్య కమిటీ త్వరలోనే విశాఖపట్నం చేరుకుంటుంది. వారు ప్రమాదం జరిగిన స్టీల్ మెల్టింగ్ షాప్ విభాగాన్ని స్వయంగా పరిశీలిస్తారు. ద్రవ ఉక్కును తరలించే లాడెల్ బకెట్ స్లైడ్ గేట్ తెరవక ముందే అసలు పేలుడు ఎందుకు సంభవించింది? ఇది సాంకేతిక లోపమా? ఇకేదైనా సమస్య? ఇలా అన్ని కోణాల్లో లోతుగా దర్యాప్తు చేసి ప్రభుత్వానికి నివేదిక ఇస్తారని తెలిపారు.
స్టీల్ ప్లాంట్లో నెలకొన్న కార్మికుల సమస్యలు, యాజమాన్య లోపాలు, సాంకేతికపరమైన ఇబ్బందులను సమగ్రంగా తెలుసుకోవడానికి త్వరలోనే కార్మిక సంఘాల ప్రతినిధులతో స్వయంగా ఒక ప్రత్యేక రౌండ్ టేబుల్ సమావేశాన్ని ఏర్పాటు చేస్తానని ప్రకటించారు డిప్యూటీ సీఎం. ప్లాంట్‌లో అసలు ఏం జరుగుతుందో క్షేత్రస్థాయిలో పనిచేసే కార్మిక సంఘాల నేతలతో మాట్లాడతాను. నిరంతరం పర్యవేక్షించాల్సిన అధికారులు ఎక్కడ నిర్లక్ష్యం వహించారు? సేఫ్టీ ప్రోటోకాల్స్ ఎందుకు పాటించలేదు? అనే అంశాలను ఈ సమావేశంలో లోతుగా చర్చిస్తాను. విశాఖ ఉక్కు–ఆంధ్రుల హక్కు అనే నినాదం కేవలం మాటలకే పరిమితం కాదని, స్టీల్ ప్లాంట్‌ను ప్రభుత్వ రంగంలోనే ఉంచాలన్నదే తమ ప్రభుత్వ గట్టి ఆకాంక్ష.
నరేంద్ర మోదీ సమర్థవంతమైన నాయకత్వంలో విశాఖ ఉక్కు కర్మాగారం ప్రభుత్వ రంగ సంస్థగానే కొనసాగుతుందని, దానికి కావాల్సిన అన్ని రకాల కేంద్ర సహాయ సహకారాలు అందుతాయని తాము బలంగా ఆశిస్తున్నామని అన్నారు. గత వైసీపీ ప్రభుత్వం స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటీకరణ చేయాలని ప్రయత్నిస్తే తాము రోడ్లపైకి వచ్చి కొట్లాడామని అన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ అనేది ఎంతోమంది త్యాగాల పునాదులపై ఏర్పడింది. ఈ ప్లాంట్ సాధన కోసం జరిగిన ఉద్యమంలో కేవలం ఆంధ్రప్రదేశ్ వారే కాకుండా, తెలంగాణకు చెందిన ముగ్గురు వ్యక్తులు కూడా తమ ప్రాణాలను అర్పించారు. దీనికి ప్రాంతాలకు అతీతమైన చారిత్రక నేపథ్యం ఉంది. స్టీల్ ప్లాంట్‌కు సొంత గనులు కేటాయించాలని కోరడానికి, ఆ సమస్యపై కేంద్ర పెద్దలతో మాట్లాడటానికి ఢిల్లీ వెళ్దాం రండి అని తాను పిలుపునిస్తే ఆ రోజు ఒక్కరు కూడా ముందుకు రాలేదు. కార్మిక సంఘాలు రాజకీయాలకు అతీతంగా పని చేసినప్పుడే కార్మికులకు నిజమైన న్యాయం జరుగుతుందని అన్నారు.
