తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. పూర్తిగా దెబ్బతిన్న మేడిగడ్డను పూర్తి చేస్తామని ప్రకటించారు. ఇందులో ఎలాంటి అనుమానం అక్కర్లేదన్నారు. అంతకు ముందు సీఎం
దెబ్బతిన్న మేడిగడ్డ ప్రాజెక్టును సందర్శించారు. మొదట ఏరియల్ రివ్వూ నిర్వహించారు. తర్వాత ప్రాజెక్టు సైట్ ను పరిశీలించారు. అనంతరం NDSA తో పాటు, ఇంజనీర్లు, సాంకేతిక నిపుణులు, నిర్మాణ సంస్థల ప్రతినిధులతో సమీక్ష నిర్వహించారు సీఎం.
సుదీర్ఘ సమీక్షలు, విశ్లేషణలు, నిపుణుల సలహాల తర్వాత మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల లోపాలపై ఎలా ముందుకెళ్లాలో ఒక స్పష్టత వచ్చిందన్నారు ఈ సందర్బంగా రేవంత్ రెడ్డి. సమస్యను అర్ధం చేసుకోవడమే సగం పరిష్కారం అన్నారు. ప్రాజెక్టుల నుండి సేకరించిన శాంపిల్స్ రిజల్ట్ కు అనుగుణంగా పనులు చేపట్టాలని అధికారులకు సూచించారు . NDSA మార్గదర్శకాలకు అనుగుణంగా ముందుకు వెళ్లాలని స్ఫష్టం చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో ప్రసంగించారు సీఎం. గత ప్రభుత్వ హయాంలో చోటు చేసుకున్న నిర్వాకం కారణంగానే ఇవాళ ప్రాజెక్టులన్నీ పండుకున్నాయని వాపోయారు.
తాము వచ్చాక పెండింగ్ లో ఉన్న ప్రాజెక్టులను, ఎత్తిపోతల పథకాలను త్వరితగతిన పూర్తయ్యేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఈ పర్యటనలో మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, శ్రీధర్ బాబు, పి.శ్రీనివాస రెడ్డి, అడ్లూరి లక్ష్మణ్, పొన్నం ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.
