అమరావతి : రాష్ట్ర పురపాలిక , పట్టణాభివృద్ది శాఖ మంత్రి పొంగూరు నారాయణ సంచలన ప్రకటన చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్ సౌకర్యం కల్పించడాన్ని తీవ్రంగా తప్పు పట్టింది రాష్ట్ర హైకోర్టు. ఈ మేరకు దానిని రద్దు చేస్తున్నట్లు తీర్పు చెప్పింది. దీంతో ఎన్నికల నిర్వహణపై అనుమానాలు నెలకొన్నాయి. దీనిపై పూర్తి క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు మంత్రి ఈ సందర్బంగా. శనివారం రాజమండ్రిలో పొంగూరు నారాయణ మీడియాతో మాట్లాడారు. బీసీలకు 34శాతం రిజర్వేషన్లపై సుప్రీంకోర్టుకు వెళ్తున్నాం అని ప్రకటించారు. సుప్రీంకోర్టు తీర్పు వచ్చే వరకు ఎన్నికలను ఆపాలని నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. గతంలో వైసీపీ జగన్ రెడ్డి ప్రభుత్వం బీసీలకు తీవ్ర అన్యాయం చేసిందని ఆరోపించారు.
బీసీలకు 34రిజర్వేషన్లు అమలు చేసేలా చర్యలు తీసుకుంటామని ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. రానున్న రోజుల్లో 123 మున్సిపాల్టీలకు ఎన్నికలు నిర్వహిస్తాం అని తెలిపారు పొంగూరు నారాయణ. గత ప్రభుత్వంలో రియల్ ఎస్టేట్ రంగం దారుణంగా దెబ్బతిందని పేర్కొన్నారు కూటమి ప్రభుత్వం వచ్చాక భవన నిర్మాణ రంగంలో అనేక సంస్కరణలు తెచ్చామని చెప్పారు. ఆన్ లైన్ లో దరఖాస్తు పెడితే చాలు .. 24గంటల్లో లేఅవుట్ , బిల్డింగ్ అనుమతులు ఇస్తున్నామని అన్నారు నారాయణ. ప్రపంచంలో టాప్ 5 రాజధానిల్లో ఒకదానిగా నిర్మించేలా అమరావతిని ప్రారంభించాం అని తెలిపారు. 2028 చివరి నాటికి అమరావతి నిర్మాణాన్ని సీఎం చంద్రబాబు పూర్తి చేస్తారని స్పష్టం చేశారు. అమరావతి పనులకు ఐఐటీ హైదరాబాద్ సాంకేతిక పరిశీలన చేస్తోందని వెల్లడించారు.
