అమరావతి : మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇటీవల రుషికొండ ప్యాలెస్ పై చేసిన వ్యాఖ్యలకు మంత్రి కందుల దుర్గేష్ ఘాటుగా సమాధానం ఇచ్చారు. ఈ క్రమంలో యోగాంధ్రపై వందల కోట్లు ఖర్చు చేశారంటూ కూటమి ప్రభుత్వం పై ఆరోపణలు చేయడం చూస్తుంటే ప్రజా ఆరోగ్యంపై మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డికి ఉన్న వైఖరి బట్టబయలు అవుతుందన్నారు. కూటమి ప్రభుత్వం ప్రజారోగ్య రక్షణ కు పెద్దపీట వేస్తోందని అన్నారు. ఈ క్రమంలోనే రూ. 94 కోట్ల కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ నిధులతో యోగాంధ్ర కార్యక్రమం నిర్వహించి ప్రతి ఒక్కరి జీవనశైలిలో అది ఒక భాగం కావాలని పిలుపు ఇచ్చామన్నారు. అంతే తప్ప సంబంధిత నిధులను దుర్వినియోగం చేశామని ఆరోపించడం సరికాదన్నారు.
రుషి కొండపై రూ.500 కోట్లు ఖర్చు చేసి విలాసవంతమైన రాజ ప్రాసాదాలను నిర్మించిన జగన్మోహన్ రెడ్డికి ప్రజా ఆరోగ్యం కోసం యోగాంధ్ర ను నిర్వహించడం తప్పు ఎలా అనిపించిందో అర్థం కావడం లేదన్నారు కందుల దుర్గేష్. గంజాయి, డ్రగ్స్ ప్రోత్సహించిన జగన్మోహన్ రెడ్డికి ప్రజల ఆరోగ్యంపై కనీసం బాధ్యత లేదని ఫైర్ అయ్యారు. శవ రాజకీయాలకు కేరాఫ్ అడ్రస్ గా నిలిచే జగన్ కు ప్రజా ఆరోగ్యం గురించి ఏం తెలుస్తుందన్నారు. కూటమి ప్రభుత్వం పేద ప్రజలకు మెరుగైన వైద్యంతో పాటు వైద్య విద్యను అందించాలని పీపీపీ మోడల్ లో మెడికల్ కాలేజీలు నిర్మించడానికి ముందుకు వచ్చిందని చెప్పారు. దానిపై రాద్ధాంతం చేయడం ఎంతవరకు సమంజసం అని ప్రశ్నించారు. పిపిపి విధానం గురించి తెలియకపోతే తెలుసుకోవాలని హితవు పలికారు.



















