విజయవాడ : స్వామి వివేకానందుడిని ప్రతి ఒక్కరు ఆదర్శంగా తీసుకోవాలని పిలుపునిచ్చారు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్. స్వామి వివేకానంద జయంతి సందర్భంగా ఆదివారం బీజేవైఎం ఆధ్వర్యంలో విజయవాడలో నిర్వహించిన 5 కిలోమీటర్ల మారథాన్ రన్ లో పాల్గొన్నారు. రాఘవయ్య పార్క్ వద్ద ఉన్న స్వామి వివేకానంద విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం మారథాన్ ను ప్రారంభించి యువతతో కలిసి పరుగులో పాల్గొన్నారు సత్య కుమార్ యాదవ్. రన్ లో విజేతలకు బహుమతులు అందజేశారు.
ఈ సందర్బంగా సత్య కుమార్ యాదవ్ ప్రసంగించారు. యువశక్తే నవభారత నిర్మాణానికి పునాది అని చెప్పారు. “నాకు ఇనుప కండరాలు, ఉక్కు నరాలు ఉన్న వంద మంది యువకులను ఇవ్వండి, ఈ దేశ గతిని మార్చేస్తాను” అని స్వామి వివేకానంద ఆనాడు ఇచ్చిన పిలుపు నేటికీ మార్గదర్శకంగా ఉందన్నారు సత్య కుమార్ యాదవ్. ఆ యువశక్తినే నమ్ముకుని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశాన్ని ప్రగతి పథంలో ముందుకు నడిపిస్తున్నారని చెప్పారు. యువతలోని నైపుణ్యాన్ని గుర్తించి వారిని పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం మేక్ ఇన్ ఇండియా, స్టార్టప్ ఇండియా వంటి వినూత్న పథకాలను అమలు చేస్తోందని అన్నారు సత్యకుమార్ యాదవ్. వీటి ఫలితంగా నేడు దేశవ్యాప్తంగా సుమారు లక్షన్నర స్టార్టప్‌లు ఏర్పడి, వాటిలో 25 నుంచి 30 యూనికార్న్ కంపెనీలు నిలిచాయంటే, అది భారత యువత ప్రతిభకు నిదర్శనం అన్నారు.
