చెన్నై : తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో తాజాగా జరిగిన రాజకీయ పరిణామాలపై స్పందించారు. రాజకీయాలలో ఇవన్నీ మామూలేనని పేర్కొన్నారు. గెలుపు ఓటములు సహజమేనని చెప్పారు. గత ఎన్నికల ఫలితాలను బట్టి చూస్తే, మేము అధికారాన్ని కోల్పోయినప్పుడల్లా చాలా తక్కువ సీట్లు మాత్రమే గెలుచుకున్నామని వెల్లడైందన్నారు స్టాలిన్. కానీ ఈసారి అలా జరగలేదన్నారు మాజీ సీఎం. తాము ఊహించని విధంగా 59 సీట్లు గెలుచు కోగలిగామని అన్నారు.
అయితే మా మిత్రపక్షాలు గెలుచుకున్న సీట్లను కూడా కలిపితే, ఆ సంఖ్య 73కి చేరుతుందన్నారు స్టాలిన్.
ఇతర పార్టీల వలె మేము భయంతో మా ఎమ్మెల్యేలను రిసార్ట్‌లు, స్టార్ హోటళ్లలో ఉంచ లేదంటూ ఎద్దేవా చేశారు మాజీ సీఎం. కానీ ఓటమిని ఎదుర్కొనేంత ధైర్యంగా ఉన్నామన్నారు. తిరిగి అధికారంలోకి రాలేక పోయినందుకు నేను ఎవరినీ నిందించ దలచు కోలేదన్నారు. పార్టీ నాయకుడిగా, ఈ ఓటమికి నేను బాధ్యత తీసుకుంటానని ప్రకటించారు. నేను విజయాన్ని గర్వంగా భావించగ లిగినప్పుడు, ఇతరులను నిందించే బదులు వైఫల్యానికి బాధ్యత తీసుకోవడంలో తప్పు లేదన్నారు. అదే న్యాయం అని స్పష్టం చేశారు మాజీ ముఖ్యమంత్రి, డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్.
