అమరావతి : రాష్ట్రంలో ప్రస్తుతం కురుస్తున్న వర్షాల కారణంగా భూగర్భ జలాలు పెరిగే ఛాన్స్ ఉందన్నారు సీఎం నారా చంద్రబాబు నాయుడు. ఈ సందర్బంగా ప్రతి నీటి చుక్కను కాపాడు కోవాలని, నీళ్లను వృధా చేయొద్దని కోరారు. సచివాలయంలో ఇవాళ వర్షాలు, వరదల పరిస్థితిపై సమీక్షించారు. ఈ సందర్బంగా కీలక సూచనలు చేశారు. నాగావళి–వంశధార బేసిన్లలో వర్షాల ప్రభావంతో ప్రవాహాలు పెరగనున్నాయని వివరిచారు సీఎంకు అధికారులు. గొట్టా బ్యారేజీకి శుక్రవారం నాటికి వార్నింగ్ లెవల్–1 చేరుకునే అవకాశం ఉందని అంచనా వేశారు. భద్రాచలం వద్ద 26 మధ్యాహ్నానికి వార్నింగ్ లెవల్–1, అదే రోజు రాత్రికి వార్నింగ్ లెవల్–2 దాటే అవకాశం ఉందని తెలిపారు. ధవళేశ్వరం బ్యారేజీ వద్ద సెప్టెంబర్ 27 ఉదయం వార్నింగ్ లెవల్–1, సాయంత్రం వార్నింగ్ లెవల్–2 దాటే అవకాశం ఉందని అంచనా వేశారు. శబరి నదిపై కుంటా వద్ద సెప్టెంబర్ 26 ఉదయానికి వార్నింగ్ స్థాయికి చేరుకునే అవకాశం ఉందని వివరించారు.
ఎల్‌నినో వంటి వాతావరణ పరిస్థితులను మార్చడం సాధ్యం కాకపోయినా.. వాటి ప్రభావాన్ని తగ్గించేలా అంతర్గత పరిస్థితులను మార్చుకోవచ్చని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. భూసారాన్ని పెంచడం, సాయిల్ టెస్టింగ్ ఆధారంగా ప్రత్యామ్నాయ పంటలను సూచించడం, బయోచార్, ప్రకృతి వ్యవసాయం వంటి విధానాల ద్వారా ఎల్‌నినో ప్రభావాన్ని కొంతమేర తగ్గించ వచ్చని తెలిపారు. ఈ విధానాన్ని రాష్ట్రంలో పైలట్‌గా అమలు చేయాలని అధికారులను ఆదేశించారు. ఎల్‌నినో ప్రభావాన్ని ముందుగానే అంచనా వేసి వ్యవసాయ రంగానికి అవసరమైన సూచనలు అందించేలా సాంకేతికతను వినియోగించు కోవాలని సీఎం సూచించారు. వ్యవసాయానికి సంబంధించిన సమాచారంతో పాటు సాగునీటి లభ్యత, రిజర్వాయర్ల పరిస్థితి తదితర వివరాల డేటా పొందుపరచాలని ఆదేశించారు.

















