అమరావతి : తాము అధికారంలోకి వచ్చాక గిరిజన గ్రామాల అభివృద్దిపై ఫోకస్ పెట్టామన్నారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. మీరు ఓట్లు వేసి గెలిపించిన ఎమ్మెల్యే ఏనాడూ మీ గ్రామానికి రాలేదన్నారు. మీ కష్టం వినలేదు. వారి హయాంలో నిధులు మళ్లించారు తప్పితే… ఏనాడు కూడా అభివృద్ధి ఊసే ఎత్తలేదన్నారు. జలజీవన్ మిషన్ పథకంలో రూ.4 వేల కోట్లు దుర్వినియోగం చేశారని ఆరోపించారు. అధికారంలోకి వచ్చిన 18 నెలల్లోనే గిరిజన గ్రామాల్లో 460 కిలోమీటర్ల మేర రోడ్లు వేశాం అన్నారు డిప్యూటీ సీఎం. గిరిశిఖర ప్రాంతాల్లో వేయాల్సిన రోడ్లు, ఇవ్వాల్సిన నీళ్లు, కట్టించాల్సిన పాఠశాల భవనాలు ఇంకా ఉన్నాయని అన్నారు. రాబోయే కాలంలో నిబద్ధతతో వాటన్నింటినీ పూర్తి చేస్తామని భరోసా ఇచ్చారు డిప్యూటీ సీఎం.
ఈ ప్రాంతంలో కూటమి అభ్యర్థులు గెలవక పోయినా ఎక్కడా వివక్ష చూపించ లేదన్నారు. జనసేన పార్టీ 13వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు లక్షలాది మంది మధ్య జరుపుకోవచ్చు. కానీ అరణ్యం మధ్యలో 40 ఇళ్లు మాత్రమే ఉన్న మారుమూల గిరిజన గ్రామంలో జరుపు కోవాలని ఇక్కడికి వచ్చానని చెప్పారు పవన్ కళ్యాణ్. ఈ ప్రాంతంలో ఆవిర్భావ వేడుకలు జరుపుకోవడం చాలా ఆనందంగా ఉందన్నారు. 70 ఏళ్లుగా రోడ్డు చూడని గ్రామానికి ఈ రోజు రోడ్డు వేయించాం అన్నారు. తానే స్వయంగా వచ్చి నాణ్యతను పరిశీలించానని చెప్పారు. ఇక్కడి ప్రజలు, యువత అండగా నిలబడితే అభివృద్ధి ఎలా ఉంటుందో మేము చేసి చూపిస్తాం అని ప్రకటించారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కొణిదల.
















