హైదరాబాద్ : రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు కీలక వ్యాఖ్యలు చేశారు. తమ ప్రభుత్వం కొలువు తీరాక పలు సంస్థలతో ఒప్పందాలు చేసుకోవడం జరిగిందన్నారు. గత సర్కార్ కేవలం ప్రచారం చేసుకునేందుకు ఎక్కువగా సమయం కేటాయించిందని ఎద్దేవా చేశారు మంత్రి. పెట్టుబడులను ఆకర్షించేందుకు ‘తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్’, ‘బయో-ఏషియాస , జాతీయ , అంతర్జాతీయ రోడ్‌షోలు, అలాగే నిర్దిష్ట రంగాలకు సంబంధించిన సదస్సుల వంటి కార్యక్రమాలను రాష్ట్ర ప్రభుత్వం క్రమబద్ధంగా నిర్వహిస్తోందని ఐటీ , పరిశ్రమల శాఖ మంత్రి డి. శ్రీధర్ బాబు తెలిపారు. శుక్రవారం ఆయన అసెంబ్లీలో శాసన సభ్యులు అడిగిన ఒక ప్రశ్నకు సమాధానమిస్తూ ఆయన ఇలా అన్నారు. మేము ప్రత్యేక నోడల్ అధికారులతో కూడిన ‘పెట్టుబడిదారుల సహాయక వ్యవస్థ’ను ఏర్పాటు చేశామని చెప్పారు.
పారిశ్రామికవేత్తలకు ఎటువంటి ఇబ్బందులు లేని అనుభవాన్ని కల్పించేందుకు నిర్ణీత కాలపరిమితితో కూడిన ‘సింగిల్-విండో’ అనుమతులు, స్వయం-ధృవీకరణ , ప్రోత్సాహకాలు , ‘ప్లగ్-అండ్-ప్లే’ మౌలిక సదుపాయాలను అందిస్తున్నామని స్పష్టం చేవారు శ్రీధర్ బాబు. గత రెండేళ్లలో (2025 , 2026లో) తెలంగాణలో పెట్టుబడుల కోసం రాష్ట్ర ప్రభుత్వం పారిశ్రామికవేత్తలు, కంపెనీలతో మొత్తం 108 అవగాహన ఒప్పందాలపై సంతకాలు చేసిందని వెల్లడించారు. గత ‘తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్’లో కుదుర్చుకున్న 75 ఒప్పందాలలో, 23 శాతం (17 ప్రాజెక్టులు) ఇప్పటికే కార్యకలాపాలు ప్రారంభించగా, మిగిలిన ప్రాజెక్టులు అమలులో వివిధ దశల్లో ఉన్నాయని తెలిపారు. గత రెండేళ్లలో దావోస్ పర్యటనల సందర్భంగా కుదుర్చుకున్న ఒప్పందాలలో దాదాపు 45 శాతం ఇప్పటికే క్షేత్రస్థాయిలో కార్యరూపం దాల్చాయని చెప్పారు దుద్దిళ్ల శ్రీధర్ బాబు.
