పరిగి/శ్రీసత్యసాయి : తమ ప్రభుత్వం నిబద్ధతతో పాలిస్తోందని, రాజకీయాలకు అతీతంగా అర్హులందరికీ సంక్షేమ ఫలాలు అందిస్తున్నామని రాష్ట్ర బీసీ, ఈడబ్లూఎస్ సంక్షేమ, చేనేత, జౌళి శాఖ మంత్రి ఎస్.సవిత స్పష్టం చేశారు. సీఎం చంద్రబాబు పాలనపై ప్రజలంతా సంతృప్తి వ్యక్తం చేస్తున్నారని, కాని జగన్, ఆయన పార్టీ నాయకులు మాత్రం విషం కక్కుతున్నారని మండిపడ్డారు. రప్పా రప్పా అంటూ రాష్ట్ర ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నారని ఆరోపించారు. వారి బెదిరింపులకు భయపడే వారెవరూ లేరని అన్నారు. దౌర్జనాలు, బెదిరింపులకు పాల్పడే వారిపై చట్టం తన పని తాను చేసుకుంటూ పోతోందని స్పష్టం చేశారు. పరిగి మండలం మోదా పంచాయతీలో ఎన్టీఆర్ భరోసా సామాజిక భద్రతా పెన్షన్లను స్థానిక నాయకులు, అధికారులతో కలిసి లబ్ధిదారుల ఇంటికి వెళ్లి ఆమె స్వయంగా అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి సవిత తనను కలిసిన విలేకరులతో మాట్లాడారు.
ప్రతి నెలా ఒకటో తేదీన ఠంఛన్ గా పెన్షన్లను పంపిణీ చేస్తున్నామన్నారు. ఒకటో తేదీన పండుగగాని, ఆదివారం గాని వస్తే ముందు రోజే పెన్షన్లు అందజేస్తున్నామన్నారు. గురువారం నూతన సంవత్సరం సంబరాలను దృష్టిలో పెట్టుకుని ముందురోజే ఇవాళ పెన్షన్లు పంపిణీ చేస్తున్నామన్నారు. సీఎం చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వ నిబద్ధతకు పెన్షన్ల పంపిణీ ఓ నిదర్శనమన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 63.12 లక్షల మందికి రూ.2,743 కోట్లను సామాజిక పెన్షన్ల రూపంలో అందజేస్తున్నామన్నారు. శ్రీసత్యసాయి జిల్లాలో 2.63 లక్షల మందికి పైగా లబ్ధిదారులకు రూ.115.51 కోట్లు, పరిగి మండలం మోదా పంచాయతీలో 1289 మందికి రూ.56 లక్షలు పంపిణీ చేస్తున్నామన్నారు. ఎన్నికల్లో హామీ ఇచ్చిన ప్రతి హామీని, సూపర్ సిక్స్ పథకాలను విజయవంతంగా అమలు చేశామన్నారు.
















