అమరావతి : ఏపీ మంత్రి ఆనం రామ నారాయణ రెడ్డి సంచలన ప్రకటన చేశారు. రాష్ట్రంలో విద్యుత్ వినియోగదారులకు తీపి కబురు చెప్పారు. ఇక నుంచి విద్యుత్ వినియోగానికి సంబంధించి ట్రూ అప్ ఛార్జీలను వసూలు చేయబోమని తెలిపారు. ఈ సందర్భంగా వాటిని పూర్తిగా రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. కాగా గత ప్రభుత్వం ఐదేళ్లలో రూ.32,166 కోట్ల ట్రూప్ అప్ చార్జీలను వసూలు చేసిందని ఆరోపించారు ఆనం రామ నారాయణ రెడ్డి. ఇక నుంచి ట్రూఅప్ చార్జీల భారం ప్రజలపై వేయకుండా తమ ప్రభుత్వమే భరిస్తుందని స్పష్టం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఏడాదికి రూ.4497 కోట్ల ట్రూఅప్ చార్జీలను ప్రభుత్వమే చెల్లింస్తుందని చెప్పారు. ఎవ్వరూ ఒక్క పైసా చెల్లించాల్సిన అవసరం లేదన్నారు. దీని వల్ల తిరుపతి రీజియన్ పరిధిలో 1551.69 కోట్ల మేర ప్రజలకు లబ్ధి జరిగిందని చెప్పారు మంత్రి.
ఇదే సమయంలో విద్యుత్ చార్జీలను కూడా తగ్గించే ఆలోచన చేస్తున్నాం అన్నారు. పెట్టుబడుల విషయంలో దేశంలోనే అగ్రగామిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉందని స్పష్టం చేశారు ఆనం రామనారాయణరెడ్డి. అందుకే గత జగన్ రెడ్డి సర్కార్ ఐదు సంవత్సరాల కాలంలో ప్రజలపై అడ్డగోలుగా మోపిన భారాన్ని తామే భరించాలని సీఎం నారా చంద్రబాబు నాయుడు నిర్ణయించారని తెలిపారు . ప్రజలపై భారం మోపిన విద్యుత్ ట్రూఅప్ చార్జీలను ఈ సంవత్సరం నుంచి తమ ప్రభుత్వం పూర్తిగా రద్దు చేస్తున్నట్లు రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి తెలిపారు.

















