అమరావతి : ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. ఆయన పదే పదే వైసీపీ చేస్తున్న ఆరోపణలను ఖండించారు. ఎలాంటి అక్రమాలకు తావు లేకుండా పూర్తి పారదర్శకతతో మెగా డీఎస్సీ చేపట్టామన్నారు. మంచి విద్య, నైపుణ్యాలు అందిస్తే అత్యుత్తమ మానవ వనరులుగా విద్యార్ధులు తయారవుతారని మేం విశ్వసించాం అన్నారు. ఐటీని ప్రోత్సహించటం ద్వారా టెక్నాలజీలో ప్రపంచంలోనే అత్యుత్తమ మానవ వనరుల్ని తయారు చేశాం అన్నారు. విద్యా రంగాన్ని తెలుగుదేశం పార్టీ ఎప్పుడూ ప్రోత్సహించిందని తెలిపారు సీఎం. రెసిడెన్షియల్ పాఠశాల ద్వారా నాడు ఎన్టీఆర్ సంస్కరణలు తెచ్చారని గుర్తు చేశారు. మహిళలకు ఉన్నత విద్యావకాశాలు కల్పించేందుకు మహిళా యూనివర్సిటినీ ఏర్పాటు చేసింది ఎన్టీఆరేనని అన్నారు. తాను సీఎం అయిన తొలినాళ్లలోనూ పాఠశాలలు లేకపోవటంపై తక్షణ చర్యలు తీసుకున్నాం అని తెలిపారు.
ప్రతీ కిలోమీటరుకు ఓ ప్రాథమిక పాఠశాల, ప్రతి 3 కి.మీ ఒక అప్పర్ ప్రైమరీ, ప్రతీ మండలానికి ఓ జూనియర్ కాలేజి, ఇంజనీరింగ్ కాలేజీ, జిల్లాకు మెడికల్ కాలేజీని ఏర్పాటు చేశాం అన్నారు సీఎం. విద్యా ప్రమాణాలు పెంచితేనే అభివృద్ధి సాధ్యం అవుతుందన్నారు. ఒక్క టీచర్ పోస్ట్ కూడా ఇవ్వకుండా 2019-24 మధ్య సంస్కరణలు తెచ్చినట్లు గత పాలకులు డబ్బాలు కొట్టుకున్నారంటూ మండిపడ్డారు. ఇప్పటి వరకూ 14 డీఎస్సీలు పెడితే, టీడీపీ హయాంలోనే 11 డీఎస్సీల ద్వారా ఉపాధ్యాయుల నియామకాలు చేపట్టాం అన్నారు సీఎం. ఇంత వరకూ అవినీతి జరిగిందని ఒక్కరు కూడా ఫిర్యాదు చేయలేదన్నారు. పాఠశాలలకు విద్యార్ధులను హాజరు పర్చాలనే లక్ష్యంతో డ్రై రేషన్ కూడా అందించాం అన్నారు. మధ్యాహ్న భోజన పథకాన్ని కూడా రాష్ట్రంలో నాడు టీడీపీ ప్రభుత్వమే ప్రవేశ పెట్టిందని చెప్పారు. ఇంటర్ విద్య వరకూ ఈ పథకాన్ని విస్తరించాం అన్నారు.
















