పార‌ద‌ర్శ‌కంగా డీఎస్సీ నిర్వహించాం : కోన శ‌శిధ‌ర్

నిబంధనల ప్రకారమే స్పోర్ట్స్ కోటాలో నియామకాలు

hellotelugu-KonaSasidhar

అమరావతి : మెగా డీఎస్సీ-2025 నిర్వహణలో ఎలాంటి పొరపాట్లూ.. తప్పిదాలు జరగలేదని విద్యా శాఖ కార్యదర్శి కోన శశిధర్ స్పష్టం చేశారు. గతేడాది డీఎస్సీ ద్వారా రిక్రూటైన అభ్యర్థులు ఎవరూ బాధపడవద్దన్నారు. చాలా కష్టపడి చదివి డీఎస్సీ ద్వారా ఉద్యోగాలను పొందారని అన్నారు. డీఎస్సీ నిర్వహణపై జరుగుతోన్న దుష్ప్రచారాన్ని, అవాస్తవాలను నమ్మొద్దని కోరారు. గత కొంత కొన్ని రోజులుగా మెగా డీఎస్సీ-2025 నిర్వహణపై రాజకీయ దురుద్దేశంతో కొన్ని పార్టీలు, పత్రికలు చేస్తోన్న దుష్ప్రచారానికి విద్యాశాఖ కార్యదర్శి స్పందించారు. ఇప్పటి వరకు ఏయే అంశాల్లో దుష్ప్రచారం జరుగుతుందో.. అ అంశాలపై సృష్టించిన అనుమానాలపై పూర్తి స్పష్టతనిచ్చారు. కొన్ని రోజులుగా డీఎస్సీ నిర్వహణపై చేస్తోన్న తప్పుడు ప్రచారంలో భాగంగా లేవనెత్తిన ప్రతీ ఆరోపణా తప్పేనంటూ ఆధారాలతో సహా ప్రెస్ మీట్ నిర్వహించారు. మెగా డీఎస్సీ 2025 నిర్వహణ ప్రక్రియను ఆసాంతం వివరిస్తూ మీడియా సమావేశంలో కోన శశిధర్ ప్రజెంటేషన్ ఇచ్చారు.

ఈ సందర్భంగా కోన శశిధర్ మాట్లాడుతూ మెగా డీఎస్సీ-2025ను అత్యంత పారదర్శకంగా నిర్వహించాం. అభ్యర్థులు కష్టపడి చదవి ఉద్యోగాలు పొందారు. 2018 తర్వాత మళ్లీ 2025లో డీఎస్సీ నోటిఫికేషన్ ఇచ్చాం. డీఎస్సీ నిర్వహణను సవాల్ చేస్తూ అడ్డుకునేందుకు 241 కేసులు వేశారు. వాటిని ఎదుర్కొని.. కోర్టుల్లో సరైన వాదనలు వినిపించి.. కోర్టు అనుమతులతో రికార్డు టైంలో 148 రోజుల్లో డీఎస్సీ ప్రక్రియను పూర్తి చేశాం. పండుగ వాతావరణంలో రిక్రూట్మెంట్ లెటర్లు ఇచ్చాం. గతేడాది జరిగిన ఈ డీఎస్సీ నిర్వహణలో తప్పిదాలు జరిగాయంటూ ఇప్పుడు మళ్లీ ఆరోపణలు రావడం వస్తున్నాయి. డీఎస్సీ నిర్వహణలో ఎలాంటి పొరపాట్లు జరగలేదని ఘంటా పధంగా చెబుతున్నాను. అయితే అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారు కాబట్టి.. ప్రజలకు వాస్తవాలు వివరించాల్సిన బాధ్యత మాపై ఉందన్నారు.

Exit mobile version