వనపర్తి జిల్లా : నెలకు లక్షకు పైగా జీతం వస్తున్నా ఉద్యోగులలో అవినీతి యావ తగ్గడం లేదు. దీంతో తెలంగాణలో ఏసీబీ మరింత దూకుడు పెంచింది. అక్రమార్కుల భరతం పడుతోంది. ఇటీవల ఏకంగా ఓ అడిషనల్ కలెక్టర్ ను కూడా పట్టుకుంది. తాజాగా ఏసీబీ దెబ్బకు జిల్లా స్థాయి అధికారి పట్టుబడడం విస్తు పోయేలా చేసింది. ఇందుకు సంబంధించి వివరాలు ఇలా ఉన్నాయి. ఫిర్యాదుధారునికి ఎటువంటి అంతరాయం లేకుండా క్రమం తప్పకుండా ఎరువు (యూరియా) ను అందించడానికి గాను వనపర్తి జిల్లా వ్యవసాయ శాఖ అధికారి పుప్పాల ఆంజనేయులు గౌడ్ లంచం డిమాండ్ చేశాడు. ఇందుకు గాను బాధితుడి నుండి 20 వేలు ఇవ్వాలని లేక పోతే యూరియాను ఇవ్వనంటూ వార్నింగ్ ఇచ్చాడు.
దీంతో రైతు ముందుగా వ్యవసాయ శాఖ జిల్లా అధికారి గౌడ్ కు అడిగిన మేర ఇస్తానని మాట ఇచ్చాడు. ఆ మేరకు ముందుగానే రూ. 3000 సమర్పించాడు. మిగిలిన డబ్బులకు సంబంధించి రూ. 10 వేలు తీసుకు రావాలని ఆదేశించాడు గౌడ్. ఇక తన వద్ద అంత డబ్బులు లేవన్నా కూడా వినిపించుకోలేదు. గత్యంతరం లేక ఏసీబీని ఆశ్రయించాడు బాధితుడు. విషయం తెలిసిన వెంటనే ఏసీబీ రంగంలోకి దిగింది. లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుంది వనపర్తి జిల్లా వ్యవసాయ శాఖ అధికారి పుప్పాల ఆంజనేయులు గౌడ్ ను. ఈ సందర్బంగా ఏసీబీ కీలక ప్రకటన చేసింది. ఒకవేళ ఏ ప్రభుత్వ సేవకుడు అయినా లంచం అడిగినట్లయితే ప్రజలు నేరుగా ఏసీబీ టోల్ ఫ్రీ నంబర్ 1064 కు డయల్ చేయాలని కోరింది. అంతే కాకుండా వివిధ సామాజిక మాధ్యమాలయిన “వాట్సాప్ ( 9440446106), ఫేస్ బుక్ (Telangana ACB), ఎక్స్ ఖాతా @TelanganaACB, వెబ్ సైట్ (http://acb.telangana.gov.in ) ద్వారా కూడా సంప్రదించాలని కోరింది.
