హైదరాబాద్ : రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు సింగరేణి కాలరీస్ లో పని చేస్తున్న అధికారులకు తీపి కబురు చెప్పింది. వీరి చిరకాల విజ్ఞప్తిపై రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, ఇంధన శాఖ మంత్రి శ్రీ భట్టి విక్రమార్క ఇచ్చిన హామీ నెరవేరింది. కోలిండియా తరహా వేతనాలను అమలు చేస్తూ సింగరేణి యాజమాన్యం సానుకూల నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయంతో ఎగ్జిక్యూటివ్ క్యాడర్–1 నుంచి ఎగ్జిక్యూటివ్ క్యాడర్–7 వరకు ఉన్న సుమారు 1,800 మంది అధికారులకు ప్రయోజనం చేకూరనుంది. సవరించిన బేసిక్ వేతనాలు 2017 జనవరి 1 నుంచి అమలులోకి వస్తాయి. అయితే, ఆర్థిక ప్రయోజనాలు సింగరేణి బోర్డు ఆమోదం తెలిపిన సెప్టెంబర్ 25, 2026 నుంచి వర్తిస్తాయి. ఈ పెరిగిన వేతనాలను అక్టోబరు నెల జీతాల నుంచి చెల్లించనున్నారు. సవరించిన వేతనాల అమలుకు సంబంధించి సంస్థ డైరెక్టర్ (పర్సనల్) గౌతమ్ పోట్రు కీలక ఉత్తర్వులు జారీ చేశారు.
కొత్త వేతనాల ప్రకారం అధికారుల బేసిక్ వేతనాలు ఇలా ఉంటాయి: క్యాడర్ ఈ1లో పని చేస్తున్న వారికి పాత బేసిక్ వేతనం 40 వేలు ఉండగా కొత్త బేసిక్ వేతనం రూ. 60 వేలు ఉంటుంది. ఇక ఈ2లో పాత బేసిక్ వేతనం రూ. 50 వేలు కాగా కొత్త బేసిక్ వేతనం రూ. 70 వేలు అవుతుంది. ఈ3లో పాత బేసిక్ వేతనం రూ. 60 వేలు కాగా , కొత్త బేసిక్ వేతనం రూ. 80 వేలు వర్తింప చేశారు. ఇక ఈ4లో పాత బేసిక్ వేతనం రూ. 70 వేలు ఉండగా వీరికి కొత్త బేసిక్ పే రూ. 90 వేలుగా నిర్ణయించారు. ఈ5లో పాత బేసిక్ వేతనం రూ. 80 వేలు ఉండగా ఇప్పుడు రూ. కొత్త బేసక్ పేతో రూ. 1 లక్ష ఇస్తారు. ఈ 6 క్యాడర్ లో పాత బేసిక్ వేతనం రూ. 90 వేలు ఉండగా కొత్త బేసిక్ వేతనం రూ. 1,20,000 గా నిర్ణయించారు. ఈ 7 క్యాడర్ లో పాత వేతనం లక్ష ఉండగా కొత్త వేతనం కింద రూ. 1,20,000గా ఇవ్వనున్నారు.
కోలిండియాలో వేతన అసమానతల నేపథ్యంలో మహారత్న సంస్థల వేతన విధానాన్ని తమకు అమలు చేయాలని కోలిండియా అధికారులు కోరారు. ఆ ప్రతిపాదనకు కేంద్ర బొగ్గు మంత్రిత్వ శాఖ, కోలిండియా యాజమాన్యం ఆమోదం తెలిపాయి. అదే విధానాన్ని సింగరేణిలోనూ అమలు చేయాలని సంస్థ అధికారులు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రికి విజ్ఞప్తి చేశారు . ఈ విజ్ఞప్తిపై స్పందించిన భట్టి విక్రమార్క దసరాలోపు అధికారులకు శుభవార్త అందేలా చర్యలు తీసుకోవాలని ఈ ఏడాది జులైలో సింగరేణి యాజమాన్యాన్ని ఆదేశించారు. అనంతరం ఈ అంశంపై సింగరేణి యాజమాన్యం కమిటీని ఏర్పాటు చేసి, దాని నివేదిక ఆధారంగా బోర్డు ఆమోదంతో వేతనాల పెంపుపై నిర్ణయం తీసుకున్నారు.
