స‌ర్కార్ చేత‌కానిత‌నం వ‌ల్లే విద్యుత్ , సాగు నీటి కొర‌త

సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేసిన మాజీ మంత్రి కేటీఆర్

hellotelugu-KTr

హైద‌రాబాద్ : మాజీ మంత్రి కేటీఆర్ నిప్పులు చెరిగారు కాంగ్రెస్ స‌ర్కార్ నిర్వాకంపై. ఆయ‌న మీడియాతో మాట్లాడారు. బొగ్గు, విద్యుత్, సాగునీటి రంగాల్లో సంక్షోభాలకు ప్రభుత్వమే బాధ్యత వహించాల‌న్నారు. సింగరేణి వ్యవహారాలు, విదేశీ బొగ్గు దిగుమతులపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ డిమాండ్ చేశారు. తెలంగాణలో బొగ్గు, విద్యుత్, సాగునీటి రంగాల్లో నెలకొన్న సంక్షోభాలకు ప్రభుత్వమే కారణమని ఆరోపించారు. సింగరేణి కాలరీస్‌లో జరిగినట్లు ఆరోపణలు వస్తున్న అక్రమాలు, విదేశీ బొగ్గు కొనుగోలు ప్రతిపాదనలు , ఇతర ఆర్థిక కుంభకోణాలపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డిని ఆయన డిమాండ్ చేశారు. నిరుద్యోగ యువతను, విద్యార్థులను, పట్టభద్రులను కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసిందని, రాబోయే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆ పార్టీకి తగిన గుణపాఠం తప్పదని ఆయన హెచ్చరించారు.

సింగరేణిలో రూ. 10,000 కోట్ల కుంభకోణం జరిగిందనే ఆరోపణలు, అలాగే సోలార్ విద్యుత్ ఒప్పందాలపై విచారణ జరిపించాలని సవాలు విసిరారు. సింగరేణిలో బొగ్గు టన్నుకు సుమారు రూ. 3,800 ధరకే లభిస్తుండగా, విదేశాల నుంచి దిగుమతి చేసుకునే బొగ్గుకు టన్నుకు రూ. 10,000 నుంచి రూ. 12,000 వరకు ఖర్చవుతుందని ఆయన పేర్కొన్నారు. దేశీయంగా బొగ్గు అందుబాటులో ఉన్నప్పటికీ, కమిషన్లు దండు కోవాలనే ఉద్దేశంతోనే ప్రభుత్వం ఆస్ట్రేలియా నుంచి బొగ్గును కొనుగోలు చేసేందుకు ప్రయత్నిస్తోంది అని ఆయన ఆరోపించారు. సింగరేణికి చెల్లించాల్సిన బకాయిలను చెల్లించడంలో ప్రభుత్వం విఫలమై, ఆ ప్రభుత్వ రంగ సంస్థను కష్టాల్లోకి నెట్టిందని కేటీఆర్ విమర్శించారు. రేవంత్ రెడ్డిని ‘ఈఎంఐ ముఖ్యమంత్రి’గా అభివర్ణించారు కేటీఆర్ .

విదేశీ బొగ్గు కొనుగోలు ప్రణాళికలు కాంగ్రెస్ హైకమాండ్ రాజకీయ అవసరాలను తీర్చుకోవడానికేనని ఆరోపించారు. గతంలో బిఆర్‌ఎస్ ప్రభుత్వం 24 గంటల విద్యుత్ సరఫరాను అందించిన విషయాన్ని గుర్తు చేశారు. ప్రస్తుతం రాష్ట్రంలో విద్యుత్ కొరత ఎందుకు ఏర్పడిందని ఆయన ప్రశ్నించారు.. సుమారు 30 లక్షల వ్యవసాయ పంపుసెట్లు విద్యుత్ పైనే ఆధారపడి ఉన్నాయన్నారు. కాబట్టి రైతులకు నిరంతర విద్యుత్ సరఫరాను అందించడం ప్రభుత్వ బాధ్యత అని ఆయన అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు నీటిని సమర్థవంతంగా వినియోగించు కోవడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని, దాదాపు 1,000 టీఎంసీల నీరు సముద్రంలో కలిసి పోయిందని కెటిఆర్ ఆరోపించారు. ‘ఎల్ నినో’ వంటి కారణాలను సాకులుగా చూపడం మానేసి, రైతులకు సాగునీరు అందించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు.

Exit mobile version