హైదరాబాద్ : సీఎం ఎ రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో 2026 ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియ కారణంగా అర్హులైన ఒక్క ఓటరు పేరు కూడా తొలగించబడ కూడదని అన్నారు. అలాగే అనర్హులెవరూ జాబితాలో చేర్చబడకూడదని స్పష్టం చేశారు. దీనికి అనుగుణంగా తగిన చర్యలు తీసుకోవాలని కోరుతూ భారత ఎన్నికల సంఘం ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ కు ముఖ్యమంత్రి లేఖ రాశారు . అభ్యంతరాలు, ఫిర్యాదులను సమర్పించడానికి గడువును పొడిగించడంతో పాటు ఓటర్లకు తగిన సమయం , అవసరమైన సహాయం అందేలా విధానపరమైన భద్రతా చర్యలను చేపట్టాలని విన్నవించారు. జూన్ 10 నాటికి రాష్ట్రంలో 3.38 కోట్ల మంది ఓటర్లు ఉన్నారని, వారిలో 73.39 లక్షల మంది (21.7%) గైర్హాజరైన వారు, నివాసం మారిన వారు, మరణించిన వారు లేదా ఒకటి కంటే ఎక్కువ చోట్ల నమోదైన వారుగా గుర్తించ బడ్డారని రాష్ట్ర ఎన్నికల సంఘం సమర్పించిన గణాంకాలను ఉటంకిస్తూ ముఖ్యమంత్రి తెలిపారు. ఈ వర్గంలో దాదాపు 62% మంది అంటే 45.19 లక్షల మంది శాశ్వతంగా నివాసం మారినట్లు గుర్తించడం ఆందోళనకరమని సీఎం పేర్కొన్నారు.
మరోవైపు డిజిటలైజ్ చేయబడిన 2.65 కోట్ల గణన ఫారమ్‌లలో 60.50 లక్షల ఫారమ్‌లలో లోపాలు ఉన్నాయని, 32.36 లక్షల ఫారమ్‌లను గత ఓటర్ల జాబితాతో సరిపోల్చలేక పోయామని ఆయన తెలిపారు. దీనివల్ల దాదాపు 92.86 లక్షల మంది ఓటర్లకు నోటీసులు జారీ చేయాల్సిన పరిస్థితి ఏర్పడిందని, ఇది రాష్ట్రంలోని మొత్తం ఓటర్లలో దాదాపు మూడింట ఒక వంతు మందిపై ప్రభావం చూపే అంశమని ఎన్నికల సంఘానికి వివరించారు . ప్రస్తుత సవరణ విధానంలో అనేక కీలక లోపాలు ఉన్నాయని ముఖ్యమంత్రి ఆ లేఖలో ఎత్తిచూపారు. ధృవీకరణ సమయంలో తాత్కాలికంగా ఇళ్లలో లేనివారిని, శాశ్వతంగా నివాసం మారినవారిని గణన సిబ్బంది ఒకేలా పరిగణిస్తున్నారని ఆయన పేర్కొన్నారు.
నిజంగా నివాసం మారిన వ్యక్తులు తమ కొత్త ప్రాంతంలో ‘ఫారం-6’ ద్వారా ఓటర్లుగా నమోదు చేసుకోవడానికి ఎటువంటి సహాయం అందించకుండానే, వారి పాత నివాస ప్రాంతం నుండి ఓట్లు తొలగించ బడుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. అంతేకాకుండా నివాసం మారిన వారి పేర్లను తొలగించే ముందు అధికారిక నోటీసు ప్రక్రియను పాటించడం లేదని తెలిపారు. దీనివల్ల ఎన్నికల రోజున పోలింగ్ కేంద్రానికి వెళ్లే వరకు తమ ఓటు హక్కు తొలగించ బడిందన్న విషయం ఓటర్లకు తెలియకుండా పోయే ప్రమాదం ఉందన్నారు. ఇది సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధమని ఆయన పేర్కొన్నారు.
రాష్ట్రంలో అందుబాటులో లేనివారు, నివాసం మారినవారు, మరణించిన వారు , ఒకటి కంటే ఎక్కువ చోట్ల నమోదైన ఓటర్లలో 58.6 శాతం మంది, అలాగే జారీ చేసిన ధృవీకరణ నోటీసులలో 41.9 శాతం కేవలం హైదరాబాద్, మేడ్చల్-మల్కాజిగిరి , రంగారెడ్డి జిల్లాల్లోనే ఉన్నారని ముఖ్యమంత్రి తెలిపారు .ఉద్యోగ బదిలీలు, వివాహాలు లేదా తాత్కాలిక నివాస మార్పుల కారణంగా పట్టణ ప్రాంతాల్లోని అనేక మంది ఓటర్లు ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉన్నందున, ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియను మరింత సులభతరం చేయాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. సమీప భవిష్యత్తులో తెలంగాణలో ఎటువంటి ఎన్నికలు లేనందున, ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియను సమగ్రంగా చేపట్టడానికి తగిన సమయం ఉందని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. అభ్యంతరాలు, ఫిర్యాదుల స్వీకరణ గడువును (ప్రస్తుతం ఆగస్టు 17 నుండి సెప్టెంబర్ 16 వరకు ఉన్న దానిని) మరో నాలుగు వారాల పాటు పొడిగించాలని, అలాగే తుది ఓటర్ల జాబితా ప్రచురణ తేదీని అక్టోబర్ 19 నుండి మార్చాలని ఆయన కోరారు.
గ్రామాలు మరియు మున్సిపల్ వార్డులలో ముందుగానే విస్తృత అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని, ముసాయిదా ఓటర్ల జాబితాలను బహిరంగంగా చదివి వినిపించేందుకు కనీసం రెండు గ్రామ సభలు , వార్డు కమిటీ సమావేశాలను నిర్వహించాలని ఆయన సూచించారు. నోటీసులు అందుకున్న రోజువారీ కూలీలు, వలస కార్మికులు , వృద్ధులు తమ పత్రాలను సమర్పించడానికి కేటాయించిన ఒక వారం గడువు సరిపోదని, కనీసం మూడు నుండి నాలుగు వారాల సమయం ఇవ్వాలని ముఖ్యమంత్రి కోరారు. ఓటర్లకు అవసరమైన పత్రాల గురించి అవగాహన కల్పించడానికి , వాటిని పొందడంలో వారికి సహాయ పడటానికి, ముఖ్యంగా పట్టణ ప్రాంతాల్లో నియోజకవర్గ పోలింగ్ కేంద్రాల స్థాయిలో సహాయ కేంద్రాలను ఏర్పాటు చేయాలని ఆయన సూచించారు.
