హైదరాబాద్ : గోల్ఫ్ పర్యాటకానికి తెలంగాణ పెద్దపీట వేస్తుందని చెప్పారు మంత్రి జూపల్లి కృష్ణారావు. షామీర్ పేట్ సమీపంలోని జవహర్ నగర్‌లో 130 ఎకరాల గోల్ఫ్ కోర్సు కు కేటాయిస్తున్నామన్నారు. సోమశిల వద్ద మరో ప్రతిపాదన చేపట్టనున్నట్లు వెల్లడించారు. ప్రపంచ స్థాయి గోల్ఫ్ మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేసి, గోల్ఫ్ పర్యాటకానికి రాష్ట్రాన్ని ప్రపంచ గమ్య స్థానంగా నిలపడానికి తెలంగాణ ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని స్పష్టం చేశారు. గోల్ఫ్ కోర్సును ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం ప్రణాళికలు రచిస్తోందని చెప్పారు. అలాగే, కృష్ణా నది ఒడ్డున ఉన్న సోమశిల వద్ద మరో ప్రపంచ స్థాయి గోల్ఫ్ కోర్సును అభివృద్ధి చేసేందుకు కూడా ప్రణాళికలు సిద్దం చేస్తున్నామన్నారు. ఈ ప్రతిపాదిత ప్రాజెక్టుల లక్ష్యం అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన గోల్ఫ్ సౌకర్యాలను సృష్టించడం, ప్రపంచ వ్యాప్తంగా ఉన్న వృత్తిపరమైన, ఔత్సాహిక గోల్ఫ్ క్రీడాకారులను ఆకర్షించడం అన్నారు.
సోమశిల వద్ద ప్రతిపాదిత గోల్ఫ్ కోర్సును, నల్లమల అడవులతో చుట్టుముట్టబడిన కృష్ణా నది సుందరమైన ప్రాంతంలో, అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ సమీపంలో అభివృద్ధి చేయనున్నారు. ఈ ప్రత్యేకమైన సహజ వాతావరణం, క్రీడ, ప్రకృతి, పర్యాటకాన్ని మేళవించి ఒక విలక్షణమైన గోల్ఫ్-పర్యాటక గమ్యస్థానాన్ని సృష్టించేందుకు ఒక అవకాశాన్ని అందిస్తుందన్నారు.ప్రతిపాదిత గోల్ఫ్-పర్యాటక మౌలిక సదుపాయాలను పబ్లిక్-ప్రైవేట్ పార్ట్‌నర్‌షిప్ (PPP) పద్ధతిలో ప్రైవేట్ భాగస్వామ్యంతో అభివృద్ధి చేయనున్నారు. ఇందులో అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన సౌకర్యాలను కల్పించడంపై ప్రభుత్వం దృష్టి సారిస్తుందన్నారు జూపల్లి కృష్ణారావు. ఇది పూర్తయిన తర్వాత, గోల్ఫ్ పర్యాటకానికి ప్రధాన కేంద్రంగా తెలంగాణ స్థానాన్ని సోమశిల మరింత బలోపేతం చేస్తుందని భావిస్తున్నారు.
