విజయవాడ : ఓటర్ జాబితాలో పేరు లేకపోయినా, వివరాల్లో తప్పులున్నా సరిచేసుకునే అవకాశం కల్పించడం జరిగిందన్నారు విజయవాడ మున్సిపల్ కమిషనర్ , డెప్యూటీ జిల్లా ఎన్నికల అధికారి ధ్యానచంద్ర. ఈ సందర్బంగా ఏర్పాటు చేసిన ప్రత్యేక క్యాంపెయిన్ డేస్‌ను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. భారత ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ప్రత్యేక శిబిరాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఇప్పటికే ఈ నెల 22, 23 తేదీల్లో ప్రత్యేక క్యాంపెయిన్ డేస్ నిర్వహించామని, ఓటర్లకు మరింత అవకాశం కల్పించేందుకు తిరిగి ప్రత్యేక క్యాంపెయిన్ డేస్ నిర్వహిస్తున్నట్లు కమిషనర్ పేర్కొన్నారు.
ప్రత్యేక క్యాంపెయిన్ డేస్‌లో భాగంగా అన్ని పోలింగ్ కేంద్రాల్లో సంబంధిత బూత్ లెవెల్ అధికారులు (BLOలు) ముసాయిదా ఓటర్ జాబితాతో పాటు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు అందుబాటులో ఉంటారని తెలిపారు.ప్రజలు తమ ఓటు వివరాలను ముసాయిదా ఓటర్ జాబితాలో తప్పనిసరిగా పరిశీలించు కోవాలని కమిషనర్ సూచించారు. ఇప్పటికే ఓటర్ జాబితాలో పేరు ఉన్న వారు తమ పేరు, చిరునామా, మొబైల్ నంబర్, ఫోటో తదితర వివరాలను పరిశీలించుకుని, ఏవైనా తప్పులు లేదా మార్పులు ఉన్నట్లయితే వాటిని సరి చేసుకునేందుకు దరఖాస్తు చేసుకోవచ్చని సూచించారు.
అదేవిధంగా ముసాయిదా ఓటర్ జాబితాలో తమ పేరు లేకపోయినా అర్హత కలిగిన ఓటర్లు ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆయన స్పష్టం చేశారు. అర్హత కలిగిన వారు కొత్తగా ఓటరుగా నమోదు చేసుకునేందుకు దరఖాస్తు చేసుకుని తమ ఓటు హక్కును భద్రపరుచు కోవచ్చని తెలిపారు. కాబట్టి ఓటర్లు ఎవరూ భయపడాల్సిన అవసరం లేదని, ఓటర్ జాబితాలో పేరు లేకపోయినా లేదా తమ వివరాల్లో ఏవైనా తప్పులు ఉన్నా వాటిని సరి చేసుకునేందుకు, అవసరమైన మార్పులు చేసుకునేందుకు, కొత్తగా ఓటరుగా నమోదు చేసుకునేందుకు తగిన అవకాశం ఉందని కమిషనర్ తెలిపారు.
అర్హత కలిగిన ప్రతి ఒక్కరూ ప్రత్యేక క్యాంపెయిన్ డేస్‌లో పాల్గొని తమ ఓటు వివరాలను పరిశీలించు కోవాలని, అవసరమైన సవరణలు, మార్పులు, చేర్పులు లేదా కొత్తగా నమోదు కోసం దరఖాస్తు చేసుకోవాలని కమిషనర్ విజ్ఞప్తి చేశారు. ప్రజలకు ఓటర్ జాబితా సంబంధిత సందేహాలు, సహాయం అవసరమైన పక్షంలో ఎన్టీఆర్ జిల్లా హెల్ప్‌లైన్ నంబర్ 9154970454ను సంప్రదించాలని సూచించారు.
