గ్లోబల్ ఏఐ హబ్ గా విశాఖ : ప‌ల్లా శ్రీ‌నివాస రావు

ఆంధ్రప్రదేశ్‌కు గ్లోబల్ ఎఐ టెక్ యుగారంభం

hellotelugu-PallaSrinivasaRao

విశాఖపట్నం : ఎల్లుండి జరగబోయే ప్రపంచ టెక్ దిగ్గజం గూగుల్ సంస్థ డేటా సెంటర్ నిర్మాణ శంకుస్థాపన కార్యక్రమానికి విశాఖపట్నం సర్వం సిద్ధమైందని టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు తెలిపారు. ఈ అత్యంత ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శంకుస్థాపన చేయనున్నట్లు పేర్కొన్నారు. సుమారు 15 బిలియన్ డాలర్ల‌ (రూ.1.35 లక్షల కోట్లు) పెట్టుబడితో 601 ఎకరాల విస్తీర్ణంలో రూపుదిద్దుకోనున్న ఈ మెగా ప్రాజెక్టు 2028 జూలై నాటికి పూర్తిస్థాయిలో అందుబాటులోకి రానుందని తెలిపారు. ఈ ప్రాజెక్టు రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు నూతన శక్తినిస్తూ, లక్షల సంఖ్యలో ఉపాధి అవకాశాలకు మార్గం సుగమం చేస్తుందని పేర్కొన్నారు.

ఈ సందర్భంగా ఆదివారం పల్లా శ్రీనివాసరావు మీడియాతో మాట్లాడారు. ఈ శంకుస్థాపనతో విశాఖపట్నం రూపురేఖలు పూర్తిగా మారబోతున్న‌ట్లు తెలిపారు.. ప్రపంచ స్థాయి సాంకేతిక మౌలిక వసతులు, భారీ పెట్టుబడులు, ఐటీ ఆధారిత పరిశ్రమలతో విశాఖ నగరం గ్లోబల్ ఎఐ హబ్‌గా అవతరించి, దేశంలోనే అగ్రశ్రేణి టెక్నాలజీ నగరంగా ఎదగనుంద‌న్నారు. ఈ ప్రాజెక్టు ఉత్తరాంధ్ర అభివృద్ధికి ఇంధనంగా నిలిచి, యువత భవిష్యత్తును మార్చే గేమ్‌చేంజర్‌గా మారుతుందని స్ప‌ష్టం చేశారు.

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దూరదృష్టి, పెట్టుబడులకు అనుకూల విధానాలు, పరిపాలనా చురుకుదనం వలన గూగుల్ వంటి అంతర్జాతీయ దిగ్గజాలను ఆకర్షిస్తున్నాయని పల్లా కొనియాడారు. అభివృద్ధిని కార్యాచరణగా మార్చే నాయకత్వం ఆయనదేనని, విజన్‌ను వాస్తవంగా మలిచే నాయకుడిగా దేశ వ్యాప్తంగా గుర్తింపు పొందారని ప్ర‌శంసించారు. అలాగే మంత్రి నారా లోకేష్ నిరంతర కృషి, వ్యూహాత్మక దృష్టి, వేగవంతమైన అమలు సామర్థ్యమే ఈ భారీ పెట్టుబడికి పునాది వేసిందని పల్లా ప్రశంసించారు. గ్లోబల్ ఇన్వెస్టర్లతో సమన్వయం చేస్తూ రాష్ట్రానికి పెట్టుబడులను రప్పించడంలో ఆయన కీలక పాత్ర పోషిస్తున్నారని అన్నారు.

Exit mobile version