హైదరాబాద్ : ఇవాళ దేశ వ్యాప్తంగా జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ సందర్బంగా దేశ ప్రధానమంత్రి నరేంద్ర దామోదర దాస్ మోదీ దేశ ప్రజలకు, ఆయా గ్రామ పంచాయతీలకు, ప్రజా ప్రతినిధులకు, గ్రామ పెద్దలకు , సర్పంచ్ లకు శుభాకాంక్షలు తెలిపారు. ఇదిలా ఉండగగా జాతీయ పంచాయతీ రాజ్ దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి రాష్ట్ర ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలిపారు. దేశ అభివృద్ధి మార్గంలో గ్రామ పంచాయతీలే కీలక పాత్ర పోషిస్తాయని, గ్రామీణ వ్యవస్థ పటిష్టంగా ఉన్నప్పుడే నిజమైన పురోగతి సాధ్యమవుతుందని పేర్కొన్నారు.
గ్రామాలే దేశాభివృద్ధికి పట్టుగొమ్మలు – అనే సత్యాన్ని ఎల్లప్పుడూ గుర్తుంచు కోవాలని అన్నారు సీఎం. ప్రజా ప్రభుత్వం అందుకు కట్టుబడి పని చేస్తుందన్నారు. స్థానిక స్వపరిపాలనకు ప్రతీకలైన పంచాయతీలు బలంగా, సమర్థవంతంగా పని చేసినప్పుడే ప్రజాస్వామ్యం బలపడుతుందని పేర్కొన్నారు.భారత రాజ్యాంగంలోని 73వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా స్థానిక సంస్థలకు లభించిన స్వయం పరిపాలన హక్కులు ప్రజాస్వామిక వికేంద్రీకరణకు దిశానిర్దేశం చేశాయని అన్నారు. సామాజిక న్యాయం, సమగ్ర అభివృద్ధి లక్ష్యాల సాధనలో పంచాయతీ రాజ్ సంస్థలు సాధికారత, సామర్థ్యం, జవాబుదారీతనం పెంపొందించు కోవడం అత్యంత అవసరం అని అభిప్రాయపడ్డారు సీఎం.
స్థానిక స్వయం పరిపాలన గ్రామీణ ప్రజల జీవితాల్లో సామాజిక, ఆర్థిక, సాంస్కృతిక మార్పులతో పాటు స్వయం సమృద్ధి దిశగా గ్రామీణ భారతదేశాన్ని ముందుకు నడిపిస్తుందని అన్నారు .
