అమరావతి : ఏపీ కూటమి సర్కార్ కీలక ప్రకటన చేసింది. ప్రస్తుతం ఖరీఫ్ సీజన్ కావడంతో రైతులకు ఇబ్బందులు లేకుండా చూడాలని నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు యూరియా పక్కదారి పట్టకుండా ప్రత్యేక విజిలెన్స్ బృందాలను ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు మంత్రి అచ్చెన్నాయుడు. రాష్ట్రవ్యాప్తంగా ప్రతి ఎరువుల బస్తాకు పూర్తి లెక్క ఉండేలా పటిష్ట పర్యవేక్షణ వ్యవస్థను అమలు చేయనున్నట్లు తెలిపారు. గతంలో జరిగిన అక్రమాలు, అవకతవకలు పునరావృతమైతే ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించదని హెచ్చరించారు. రైతులకు ఎరువుల బుకింగ్ కోసం అందుబాటులో ఉన్న యాప్ నిర్వహణ మరింత సజావుగా ఉండాలని మంత్రి సూచించారు. ముఖ్యంగా కౌలు రైతులు, ఆండ్రాయిడ్ ఫోన్ లేని రైతులు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. ఓటీపీలు ఆలస్యంగా రావడం, మెసేజ్ లింకులు సకాలంలో అందకపోవడం వంటి సమస్యల పరిష్కారానికి తక్షణ చర్యలు తీసుకుంటామని తెలిపారు.
వ్యవసాయ రంగంలో ఆధునిక పద్ధతులతో పాటు పర్యావరణ హిత విధానాలకు కూడా ప్రాధాన్యం ఇవ్వాల్సిన అవసరం ఉందని మంత్రి పేర్కొన్నారు. నానో యూరియా వల్ల కలిగే ప్రయోజనాలపై రైతులకు విస్తృత స్థాయిలో అవగాహన కల్పించాలని సూచించారు. అదే సమయంలో సహజ వ్యవసాయంపై రైతుల్లో ఆసక్తి రోజురోజుకూ పెరుగుతోందని, దీనిని మరింత ప్రోత్సహించాల్సిన అవసరం ఉందన్నారు. రసాయన ఎరువుల అధిక వినియోగం వల్ల నేల సారంపై ప్రతికూల ప్రభావం పడే అవకాశం ఉందని పేర్కొన్న మంత్రి, సాధ్యమైనంత మేర రసాయన ఎరువుల వినియోగాన్ని తగ్గించి సమతుల్య పోషకాల వినియోగంపై రైతులు దృష్టి సారించాలని సూచించారు.
అధిక ఎరువుల వినియోగం పట్ల అప్రమత్తంగా ఉండాలని రైతులకు విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర ప్రభుత్వానికి రైతుల సంక్షేమం, ప్రయోజనాలే అత్యంత ప్రాధాన్యమని స్పష్టం చేసిన మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు. ఖరీఫ్ సీజన్‌లో రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని అధికారులను ఆదేశించారు.
