మెట్రో ఫేజ్ -2 విస్త‌ర‌ణ‌పై సీఎం చ‌ర్చ‌లు ఫ‌లప్ర‌దం

కేంద్ర మంత్రుల‌తో భేటీ అయిన ఎ. రేవంత్ రెడ్డి

hellotelugu-CMRevanthReddy

ఢిల్లీ : తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రి ఎ. రేవంత్ రెడ్డి ఢిల్లీ ప‌ర్య‌ట‌న‌లో బిజీగా ఉన్నారు. ఈ సంద‌ర్బంగా ఆయ‌న కేంద్ర మంత్రుల‌తో వ‌రుస‌గా భేటీ అయ్యారు. కీల‌క చ‌ర్చ‌లు జ‌రిపారు. హైద‌రాబాద్ మెట్రో రైలు స్వాధీనం, ఫేజ్-2 విస్త‌ర‌ణ‌పై సుదీర్ఘంగా చ‌ర్చించారు. హైద‌రాబాద్ మెట్రో ఫేజ్‌-I స్వాధీనం చేసుకోవ‌డంతో పాటు ఫేజ్‌-2 విస్త‌ర‌ణ‌పై ఉన్న ఆటంకాల‌ను తొల‌గించేందుకు ముఖ్య‌మంత్రి కేంద్ర మంత్రుల‌తో వ‌రుస‌గా రెండు రోజుల పాటు జ‌రిపిన చర్చలు విజయవంతం అయ్యాయి. మొద‌ట‌గా కేంద్ర మంత్రి అశ్విని వైష్ణ‌వ్ తో పాటు కేంద్ర బొగ్గు, గ‌నుల శాఖ మంత్రి కిష‌ణ్ రెడ్డితో భేటీ అయ్యారు. ఇవాళ కేంద్ర గృహ నిర్మాణ‌, ప‌ట్ట‌ణ వ్య‌వ‌హారాల శాఖ మంత్రి మ‌నోహ‌ర్ లాల్ ఖ‌ట్ట‌ర్ తో ప్ర‌త్యేకంగా చ‌ర్చ‌లు జ‌రిపారు సీఎం.

ఈ సంద‌ర్బంగా హైద‌రాబాద్ మెట్రో ఫేజ్‌- I వాల్యూయేష‌న్‌, స్వాధీనానికి అవ‌స‌ర‌మైన రుణ సేక‌ర‌ణ‌, రుణ సంస్థ ఎంపిక, మెట్రో ఫేజ్‌-II విస్త‌ర‌ణ‌, నిర్మాణ‌ వ్య‌యం, అందుకు అవ‌స‌ర‌మైన రుణ సేక‌ర‌ణ తదితర అంశాల‌ను అధ్య‌య‌నం చేసేందుకు క‌న్స‌ల్టెంట్‌ను నియ‌మించాల‌ని కేంద్ర మంత్రులు, ముఖ్య‌మంత్రి సమావేశంలో ఏకాభిప్రాయానికి వ‌చ్చారు . క‌న్స‌ల్టెంట్‌గా ఎస్బీఐ క్యాప్ ను ఎంపిక చేశారు. మెట్రో ఫేజ్‌-I వాల్యూయేష‌న్‌, ఫేజ్‌-II విస్త‌ర‌ణ‌తో పాటు ఇత‌ర అంశాల‌పై స‌ద‌రు సంస్థ‌ స‌మ‌గ్రంగా అధ్య‌య‌నం చేయ‌నుంది. ఆ సంస్థ ఇచ్చే నివేదిక ఆధారంగా భ‌విష్య‌త్ కార్యాచ‌ర‌ణ చేప‌ట్ట‌నున్నారు.

ఇదిలా ఉండ‌గా క‌న్స‌ల్టెంట్ అధ్య‌య‌నం స‌మ‌యంలో స‌మ‌న్వ‌యానికి ప్ర‌తినిధులుగా కేంద్ర ప్ర‌భుత్వం నుంచి ఒక అధికారి, రాష్ట్ర ప్ర‌భుత్వం త‌ర‌ఫున రాష్ట్ర పుర‌పాల‌క‌, ప‌ట్ట‌ణాభివృద్ధి శాఖ ప్ర‌త్యేక కార్య‌ద‌ర్శి ఉండాల‌ని స‌మావేశంలో నిర్ణ‌యించారు. ఈ అధికారులు ఇద్ద‌రు స‌మ‌న్వ‌యం చేసుకుంటూ ఈ ప్ర‌క్రియ వేగంగా ముందుకు సాగేందుకు కృషి చేస్తార‌ని ప్ర‌క‌టించారు సీఎం ఎ. రేవంత్ రెడ్డి.

Exit mobile version