తిరుమల : తిరుమల లోని హోటళ్లు, ఫాస్ట్ ఫుడ్ సెంటర్లలో భక్తులకు నాణ్యమైన, పరిశుభ్రమైన ఆహారాన్ని తయారు చేసి భక్తుల ఆహార భద్రతపై బాధ్యతాయుతంగా వ్యవహరించాలని టీటీడీ అదనపు ఈవో సి.హెచ్.వెంకయ్య చౌదరి అన్నారు. బ్రహ్మోత్సవాలు రానున్న నేపథ్యంలో తిరుమలలోని ఆస్థాన మండపంలో హోటల్ నిర్వాహకులతో టీటీడీ అదనపు ఈవో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హోటల్ పరిశుభ్రత, ఫుడ్ ప్రాసెసింగ్ పై గత రెండేళ్లలో తిరుమలలోని వివిధ హోటల్ యాజమాన్యాలకు, నిర్వాహకులకు అనేక శిక్షణా కార్యక్రమాలు నిర్వహించామన్నారు.
భక్తుల ఆహార భద్రతే మనందరి ప్రధమ బాధ్యత అన్నారు. ఇకపై ప్రతినెలా తప్పనిసరిగా కనీసం 10 నుండి 15 శాంపిల్స్ తో నూతన ఆధునిక ఆహార పదార్థాల పరీక్షల్యాబ్లో టెస్టులు నిర్విహిస్తామని చెప్పారు.
ల్యాబ్ టెస్టుల్లో నిబంధనలకు అతీతంగా ఫలితాలు వస్తే రూ.5 లక్షల జరిమానాతో పాటు తమకు కేటాయించిన దుకాణాన్ని సీజ్ చేసేటటువంటి చర్యలు కూడా ఉంటాయన్నారు. అదేవిధంగా హోటల్ నిర్వాహకులు తమకు కేటాయించిన స్థలాన్ని దాటి ఆక్రమణలకు పాల్పడ రాదన్నారు.
త్వరలో తిరుమలలోని హోటళ్లలోని వంట గదులను ఆడిటింగ్ చేసి భద్రతా ప్రమాణాలపై సర్టిఫికేట్ జారీ చేస్తామని చెప్పారు. తిను బండారాలను ఎమ్మార్పీ ధరలకు మాత్రమే విక్రయించాలని సూచించారు. హోటల్ లో పని చేస్తున్న కార్మికులందరికీ వైద్య పరీక్షలు నిర్వహించేందుకు హెల్త్ క్యాంపులు ఏర్పాటు చేస్తామని చెప్పారు. అంతకు ముందు ఎఫ్ఎస్ఎస్ఏఐ అధికారి జగదీష్ తిరుమలలో హోటల్ నిర్వాహకులు పాటించాల్సిన నియమ, నిబంధనలను వివరించారు.


















