హైదరాబాద్ : ఇండియన్ రాక్ స్టార్ గా గుర్తింపు పొందిన సంగీత దర్శకుడు, గాయకుడు దేవిశ్రీ ప్రసాద్. ఆయన హీరోగా కొత్త అవతారం ఎత్తారు. టాలీవుడ్ లో కమెడియన్ గా గుర్తింపు పొందిన వేణు ఉన్నట్టుండి దర్శకుడిగా బలగం మూవీ తీశాడు. ఇది సంచలనం సృష్టించింది. కాసుల వర్షం కురిపించింది. ఇరు తెలుగు రాష్ట్రాలతో పాటు దేశ వ్యాప్తంగా పేరు పొందింది. ప్రపంచ దృష్టిని ఆకర్షించింది. అంతే కాకుండా పెద్ద ఎత్తున అవార్డులు, పురస్కారాలు దక్కాయి బలగం సినిమాకు. తాజాగా వేణు దర్శకత్వం వహిస్తున్న మరో చిత్రం యల్లమ్మ. తెలంగాణ బతుకును ఆవిష్కరించే ప్రయత్నం చేస్తున్నాడు. ఆ సినిమా పేరే యల్లమ్మ. ఇందులో ఎవరూ ఊహించని విధంగా మ్యూజిక్ డైరెక్టర్ గా ఉన్న దేవిశ్రీ ప్రసాద్ ను హీరో చేశాడు. ఇందుకు సంబంధించి సినిమా షూటింగ్ కూడా దాదాపు పూర్తయినట్లు సమాచారం.
టాలీవుడ్ రాక్‌స్టార్ దేవీ శ్రీ ప్రసాద్, ‘యల్లమ్మ’ చిత్రం ద్వారా కథానాయకుడిగా పరిచయ మవుతున్నారన్న విషయం తెలిసిందే. ఆయన పుట్టినరోజు సందర్భంగా చిత్ర బృందం ఇప్పటికే ఆయన ఫస్ట్ లుక్ పోస్టర్‌ను విడుదల చేసి, అందులో ఆయనను ‘పార్షి’ అనే పాత్రలో పరిచయం చేసింది. తాజాగా దసరా పండుగ సందర్భంగా ఈ సినిమా విడుదల తేదీని చిత్ర బృందం ప్రకటించింది. విశేషమేమిటంటే ప్రభాస్ నటించాల్సిన ‘స్పిరిట్’ చిత్రం అక్టోబర్‌కు వాయిదా పడటంతో, ఆ స్లాట్‌ను ‘యల్లమ్మ’ చిత్రం దక్కించుకుంది. సోషల్ మీడియా వేదికగా విడుదల తేదీ పోస్టర్‌ను పంచుకుంటూ, అందరికీ దసరా శుభాకాంక్షలు తెలియజేశారు. ఆ పోస్టర్‌లో ఇలా పేర్కొన్నారు. మన నేల మూలాల నుండి పుట్టిన ఒక శక్తివంతమైన కథ, దేశ వ్యాప్తంగా తన గళాన్ని వినిపించేందుకు సిద్ధమైంది .
యల్లమ్మ ప్రపంచ వ్యాప్తంగా వచ్చే ఏడాది 2027 మార్చి 5న ప్రేక్షకుల ముందుకు రానుందని ప్రకటించారు చిత్ర దర్శకుడు వేణు. తెలుగు, తమిళం, హిందీ, కన్నడ , మలయాళ భాషల్లో విడుదల కానుంది. పాన్-ఇండియా ప్రాజెక్ట్‌గా రూపొందుతోంది ఈ మూవీ. గ్రామీణ నేపథ్యంలో సాగే ఈ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌కు ‘బలగం’ ఫేమ్ వేణు ఎల్దండి దర్శకత్వం వహిస్తుండగా, శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు, శిరీష్ దీనిని నిర్మిస్తున్నారు.
