హైదరాబాద్ : తెలుగు చలన చిత్ర పరిశ్రమలో అత్యంత జనాదరణ పొందిన నటుడు, దర్శకుడు వెంకటేశ్, త్రివిక్రమ్ శ్రీనివాస్ ల కలయికలో వస్తున్న చిత్రం ఆదర్శ కుటుంబం. ఇప్పటికే సినిమాకు సంబంధించి కీలక అప్ డేట్ వచ్చింది. షూటింగ్ కూడా ప్రారంభమైంది. ఇవాళ సోషల్ మీడియా వేదికగా అప్ డేట్ ఇచ్చే ప్రయత్నం చేశారు దర్శకుడు. ఈ చిత్రానికి ‘ఆదర్శ కుటుంబం హౌస్ నంబర్ 47’ – AK 47’ అనే టైటిల్ ఫిక్స్ చేశారు.
ఇప్పటికే వెంకటేశ్ బ్లాక్ బస్టర్ మూవీస్ లో నటించాడు. తనతో సినిమాలు చేసిన సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి రూ. 300 కోట్ల క్లబ్ లోకి తీసుకు వెళ్లాడు. సంక్రాంతికి వస్తున్నాం సూపర్ హిట్. అంతకు ముందు తనతో తీసిన ఎఫ్ -2 , ఎఫ్ -3 సీక్వెల్ మూవీస్ కూడా భారీ కలెక్షన్స్ కొల్లగొట్టాయి. ఈ ఏడాది సంక్రాంతికి వచ్చిన మెగాస్టార్ చిరంజీవితో కలిసి నటించిన మన శంకర వర ప్రసాద్ గారు మూవీ కూడా బిగ్ హిట్ గా నిలిచింది. ఇది కూడా రూ. 300 కోట్లు కొల్లగొట్టింది.
ఈ తరుణంలో విక్టరీ వెంకటేశ్ తో మాటల మాంత్రికుడు సినిమా చేస్తుండడంతో భారీగా అంచనాలు నెలకొన్నాయి. వెంకటేష్ వంటి క్లాస్ అండ్ మాస్ హీరోతో కొత్త చిత్రాన్ని అనౌన్స్ చేసినప్పటి నుంచే వీళ్ల కలయికలో ఎలాంటి చిత్రం రాబోతుందా అని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఫ్యాన్స్ ను దృష్టిలో పెట్టుకుని టైటిల్ క్యాచీగా ఉండేలా పెట్టాడు త్రివిక్రమ్ శ్రీనివాస్.
ఈ టైటిల్ ను బట్టే ఈ సినిమా పూర్తిగ కుటుంబ నేపథ్యంలో తెరకెక్కబోతున్నట్టు తెలుస్తోంది. కుటుంబం కోసం కష్టపడే మిడిల్ క్లాస్ అంకుల్ పాత్రలో వెంకీ మామ కనిపించబోతున్నాడు. మూడు షెడ్యూల్స్ లో కంప్లీట్ చేసి వచ్చే ఏడాది వేసవిలో ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నట్టు ప్రకటించారు. ఈ సినిమాలో వెంకీ మామ సరసన కేజీఎఫ్ ఫేమ్ శ్రీనిధి శెట్టి కథానాయికగా నటిస్తోంది. వెంకటేష్ సినీ ప్రయాణంలో 77వ సినిమాగా రాబోతుంది.
