హైదరాబాద్ : సట్లూజ్ సినిమా ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చకు దారితీసింది. దీనికి కారణం జశ్వంత్ సింగ్ ఖల్రా జీవిత చరిత్ర ఆధారంగా తీశారు. ఇందులో పంజాబ్ ప్రముఖ నటుడు, గాయకుడు దిల్జిత్ దోసాంజ్ కీలక పాత్ర పోషించాడు. సిక్కు మానవ హక్కుల కార్యకర్త గా గుర్తింపు పొందాడు జశ్వంత్ సింగ్ ఖల్రా . ఈ చిత్రం జూలై 3న విడుదలైంది, కానీ జూలై 5 నాటికి ప్లాట్‌ఫారమ్ నుండి తొలగిస్తున్నట్లు సంచలన ప్రకటన చేసింది జీ 5 మీడియా సంస్థ. ఎందుకు తొలగించాలనే దానిపై ప్రస్తుత పరిణామాలు అని మాత్రమే పేర్కొంది. అయితే ఇందుకు వాస్తవానికి స్పష్టమైన వివరణ ఇవ్వలేదు. అయితే, అంతర్జాతీయంగా జీ5 గ్లోబల్‌లో ఈ చిత్రం అందుబాటులోనే ఉంది.
1980లు , 1990లలోని ఉగ్రవాద వ్యతిరేక పోరాట కాలంలో, పంజాబ్ పోలీసులు వేలాది మంది పౌరులను అక్రమంగా అపహరించడం, హింసించడం, రహస్యంగా సామూహిక దహన సంస్కారాలు చేయడం వంటి చర్యలను జశ్వంత్ సింగ్ ఖల్రా దర్యాప్తు చేసి బయట పెట్టారు. ఆపరేషన్ బ్లూ స్టార్, ఆ తర్వాత ప్రధాని ఇందిరా గాంధీ హత్య , 1984 నాటి సిక్కు వ్యతిరేక అల్లర్ల అనంతరం ఈ సంఘటనలు చోటు చేసుకున్నాయి. ఈ సంఘటనల తర్వాత, అనుమానిత ఉగ్రవాదులనే నెపంతో ఏ కారణం చేతనైనా అనుమానితులను నిర్బంధించే అధికారం పోలీసులకు లభించింది, దీనివల్ల పెద్ద సంఖ్యలో నిర్బంధాలు జరిగాయి. పంజాబ్ పోలీసుల ప్రమేయంతో జరిగిన అక్రమ హత్యలు, దహన సంస్కారాలపై ఆయన చేసిన పరిశోధన ప్రపంచవ్యాప్త దృష్టిని ఆకర్షించింది.
ఈ వ్యవహారంలో సహకరించడానికి నిరాకరించిన పోలీసు అధికారులు కూడా హత్యకు గురయ్యారని చెబుతారు. సెప్టెంబర్ 1995లో అమృత్‌సర్‌లోని తన ఇంటి బయట నుండి ఆయన అపహరణకు గురయ్యారు. అవినీతిపరులైన పోలీసు అధికారులు ఆయన్ని అక్రమ నిర్బంధంలోకి తీసుకుని, ఆ తర్వాత హత్య చేశారని ఆరోపణలు ఉన్నాయి. ఆయన అదృశ్యమైనప్పటికీ, ఆయన వెలికితీసిన వాస్తవాలపై సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ దర్యాప్తు చేపట్టింది. ఆ తర్వాత సుప్రీంకోర్టు దీనిని ధృవీకరించింది, ఫలితంగా ఆయన మరణానికి కారణమైన ఆరుగురు పోలీసు అధికారులకు జీవిత ఖైదు విధించారు.
ఈ అంశం సున్నితత్వం దృష్ట్యా, సినిమా విడుదలకు ముందే అనేక సమస్యలను ఎదుర్కొంది. ఓటీటీ విడుదలకు ముందు అనేక ఆటంకాలు ఎదురయ్యాయి. హనీ త్రెహాన్ దర్శకత్వంలో రూపొందిన ఈ మూవీ ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంది. ‘పంజాబ్ ’95’ , ఆపై ‘సట్లూజ్’ వరకు ఈ ప్రాజెక్ట్ అనేకసార్లు పేరు మార్పులకు గురైంది. ఇది ఫిబ్రవరి 7, 2025న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కావాల్సి ఉన్నప్పటికీ, వెండితెరపైకి రాలేదు. చివరకు ఓటీటీలో స్ట్రీమింగ్ అయ్యింది. కేవలం రెండు రోజులకే తొలగించబడిన తన ‘సట్లూజ్’ (Satluj) చిత్రంపై నిషేధం తప్పదని తనకు ముందే తెలుసని, అది జరుగుతుందని తాను ఊహించానని దిల్జిత్ దోసాంజ్ తన ఇన్‌స్టాగ్రామ్ వీడియోలో పేర్కొన్నారు.
