హైదరాబాద్ : హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. పిల్లల భద్రత విషయంలో తల్లిదండ్రులు, పాఠశాలలు, డ్రైవర్లు బాధ్యతగా వ్యవహరించాలని పేర్కొన్నారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. మహారాష్ట్రలో ఇటీవల జరిగిన ఒక సంఘటనను ప్రస్తావించారు. పిల్లలకు చిన్న వయసు నుండే రోడ్డు భద్రతా నియమాలను నేర్పించాలని ఆయన అన్నారు. పాఠశాలకు వెళ్లేటప్పుడు, తిరిగి వచ్చేటప్పుడు పిల్లల భద్రతను నిర్ధారించడానికి తల్లిదండ్రులు, పాఠశాల యాజమాన్యాలు, డ్రైవర్లు సమన్వయంతో, బాధ్యతాయుతంగా పనిచే యడం అత్యవసరమని ఆయన పేర్కొన్నారు. రోడ్డు దాటే ముందు ఇరువైపులా చూడటం, వాహనాలు లేనప్పుడు మాత్రమే నెమ్మదిగా దాటడం వంటి – ఆగండి, చూడండి, దాటండి – అనే అలవాటును పిల్లల్లో పెంపొందించేలా ప్రోత్సహించాలని వీసీ సజ్జనార్ సూచించారు.
సాధ్యమైనంత వరకు చిన్న పిల్లలు ఒంటరిగా రోడ్డు దాటకూడదని హితవు పలికారు వీసీ సజ్జనార్. పెద్దల పర్యవేక్షణలో వారు రోడ్డు దాటేలా చూడటం ఉత్తమం అని పేర్కొన్నారు. విద్యార్థులను రవాణా చేయడం మాత్రమే కాకుండా, వారు బస్సు దిగిన తర్వాత సురక్షితంగా ఉన్నారని నిర్ధారించు కోవడం కూడా బస్సు సిబ్బంది బాధ్యత అని స్పష్టం చేశారు. విద్యార్థి సురక్షితంగా రోడ్డు దాటే వరకు లేదా వారి తల్లిదండ్రులకు అప్పగించే వరకు బస్సు అటెండెంట్ స్వయంగా వారితో ఉండాలన్నారు. బస్సులను రద్దీగా ఉండే లేదా అసురక్షిత ప్రదేశాలలో కాకుండా, కేవలం సురక్షితమైన బస్సు స్టాప్‌ల వద్ద మాత్రమే ఆపాలన్నారు. స్కూల్ జోన్‌లు లేదా స్కూల్ బస్సులు ఆగి ఉన్న ప్రాంతాల గుండా వెళ్లేటప్పుడు వాహన వేగాన్ని గణనీయంగా తగ్గించాలి. ఆగి ఉన్న బస్సు ముందు లేదా వెనుక నుండి పిల్లలు అకస్మాత్తుగా రోడ్డుపైకి వచ్చే అవకాశం ఉన్నందున అత్యంత అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. ప్రయాణంలో తొందరపడటం కంటే ప్రాణం చాలా విలువైనదన్నారు.
