కృష్ణా జిల్లా : మచ్చలేని మహా నాయకుడు మాజీ దేశ ప్రధాని అటల్ బిహారి వాజ్ పాయ్ అని అన్నారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్. మంగళవారం కృష్ణా జిల్లా మచిలీపట్నంలో అటల్ మోడీ సుపరిపాలన యాత్ర సభ జరిగింది. ఈ సందర్బంగా మాధవ్ ప్రసంగించారు. 70 ఏళ్ల రాజకీయ జీవితంలో ఒక్క మచ్చ లేని నిష్కలంక చరితుడు వాజ్ పాయ్ అని కొనియాడారు. అవినీతి అనేది లేకుండా పాలన సాగించిన మహోన్నత వ్యక్తి అని అన్నారు. వాజ్ పాయ్ విగ్రహావిష్కరణ సభకు లోకేష్ రావడం చాలా ఆనందంగా ఉందన్నారు. రాజకీయాల్లోకి రావడానికి, సామాజిక సేవ చేయడానికి స్పూర్తి ఎవరంటే వాజ్ పాయ్ అని నారా లోకేష్ చెప్పారని అన్నారు.
దేశ రాజకీయాల్లో తనదైన ముద్ర వేసుకున్న వ్యక్తి వాజ్ పాయ్ అని చెప్పారు పీవీఎన్ మాధవ్. బలరాం పూర్ నుంచి ఎంపీగా పార్లమెంట్ లో అడుగు పెట్టిన సమయంలో ఆయన చేసిన ప్రసంగానికి నెహ్రూ సైతం ఆశ్చర్య పోయారని అన్నారు. మధుర నుంచి పోటీ చేసి ఓడిపోయినా.. రాజామహేంద్ర సింగ్ చేతిలో ఓడిపోవడం గర్వంగా ఉందని చెప్పిన గొప్ప నేత వాజ్ పాయ్ అన్నారు. ఆనాడు మన ప్రాంతంలో చైనా ఆక్రమిస్తే.. వాజ్ పాయ్ పార్లమెంటులో గర్జించారని గుర్తు చేశారు. నెహ్రూ ఆరోజు మనకు పనికిరాని స్థలం ఆక్రమిస్తే ఏమవుతుందని అంటే.. సభలో పెద్ద ఎత్తున దుమారం రేగిందన్నారు. చివరకు నెహ్రూ తాను తప్పు మాట్లాడానని అంగీకరించేలా వాజ్ పాయ్ చెప్పిన కవిత అందరికీ ఆదర్శం అన్నారు మాధవ్.
