అమరావతి : మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో దిగజారిపోయిన శాంతి- భద్రతలు, రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులు, కష్టాలపై ప్రతి రోజూ మాట్లాడుతూనే ఉంటానని ప్రకటించారు. రెండేళ్ల క్రితం వరకూ ఆంధ్రప్రదేశ్ పేరు చెప్తే, సంక్షేమం, అభివృద్ధి, విద్య, వైద్యం, వ్యవసాయం, పరిపాలనా రంగాల్లో విప్లవాత్మక సంస్కరణలు, ప్రజలకు మేలు జరిగిన కార్యక్రమాల గురించి మాట్లాడుకునే వారన్నారు. కాని, ఇవాళ ఏపీ పేరు చెప్తే రెడ్‌బుక్ రాజ్యాంగం, కస్టోడియల్ డెత్స్, తర్వాత శవాలను మాయం చేయడం మొదలు, పాలన అంటే మోసాలు, అబద్ధాలు, ప్రజలకు వెన్నుపోట్లు అని చెప్పుకుంటున్న పరిస్థితి నెలకొందన్నారు .
బుధవారం జగన్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. Rule of law స్థానంలో Rule of Fear తీసుకు వచ్చారని ఆరోపించారు. పోలీస్‌స్టేషన్లకు వెళ్తే న్యాయం జరుగుతుందనే నమ్మకం, విశ్వాసం పూర్తిగా పోయి, ప్రజలు భయపడే స్థాయికి రాష్ట్రాన్ని తీసుకెళ్లారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి పరిస్థితులు యాథృచ్ఛికంగా వచ్చినవి కావన్నారు. తాను చేస్తున్న దోపిడీ, అవినీతి, దుర్మార్గ పాలనను ఎవ్వరూ ప్రశ్నించకూడదని, ఎవ్వరూ నిలదీయ కూడదని, చట్టాన్ని చేతిలోకి తీసుకుంటూ, దాన్ని ఒక రాజకీయ ఆయుధంగా చంద్రబాబు మార్చుకున్నారని మండిపడ్డారు.
అరాచక రెడ్‌బుక్ రాజ్యాంగాన్ని ప్రతిపక్ష పార్టీపైన, సోషల్‌మీడియా యాక్టవిస్టులపైనా, జర్నలిస్టులపైనా అందరిపైనా ప్రయోగించాడని ఆగ్రహం వ్యక్తం చేశారు జగన్ రెడ్డి. ఇవాళ మనం చూస్తున్న ఈ దుర్మార్గాలన్నీ కూడా దాని పర్యవసానాలేనని పేర్కొన్నారు. మనం మనుషులమేనని మరిచిపోయి, ఒక మనిషిని మనం ఏం చేసినా అడిగేవాడు ఉండడనే ధైర్యం అసలు ఎక్కడ నుంచి వచ్చింది? ఇది ప్రభుత్వం తప్పుకాదా? అని ప్రశ్నించారు జగన్ రెడ్డి.
