హైదరాబాద్ : ప్రముఖ అనలిస్ట్ వి. ప్రకాష్ సంచలన వ్యాఖ్యలు చేశారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో టీడీపీ పాలన సాగిస్తోందని ధ్వజమెత్తారు. చంద్రబాబు నాయుడు డైరెక్షన్ చేస్తే సీఎం రేవంత్ రెడ్డి యాక్షన్ చేస్తున్నాడని ఆరోపించారు. తను చెప్పినట్లే ఇక్కడ పాలకులు నడుచుకుంటున్నారని మండిపడ్డారు ప్రకాష్. కాంగ్రెస్ నాయకులు ఇసుక కోసం కట్టిన బ్యారేజీలనే కూల్చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. చంద్రబాబు నాయుడు కుట్రలో భాగంగా రేవంత్ రెడ్డి మేడిగడ్డకు బాంబులు పెట్టి పేల్చాడని మండిపడ్డారు. ఇప్పుడు అన్నారం బ్యారేజీ దగ్గర ఇసుక తవ్వేసి దాన్ని కూల్చే ప్రయత్నం చేస్తున్నారని వాపోయారు .
అన్నారం బ్యారేజీలో నీళ్ళు నిల్వ చేయడానికి వీలున్నా నిల్వ చేయక పోవడం చూస్తే పలు అనుమానాలు కలుగుతున్నాయని అన్నారు ప్రకాష్. మంత్రులు, స్థానిక నాయకులు, అధికారులు కలిసి అన్నారం బ్యారేజీ దగ్గర యధేచ్చగా ఇసుక అక్రమ రవాణా చేయాలని చూస్తున్నారంటూ భగ్గుమన్నారు.
2019 అక్టోబర్ 9న ఎన్నికల షెడ్యూల్ రావడంతో కేసీఆర్ చేతిలో అధికారం లేకుండా ఎన్నికల కమిషన్ దగ్గర పాలనా అధికారాలు ఉన్నాయన్నారు. అక్టోబర్ 21న మేడిగడ్డ దగ్గర బ్లాస్ట్ జరిగిందని, దీని మీద ఎఫ్ఐఆర్ నమోదైనా, ఇప్పటి వరకు విచారణ ఎందుకు చేపట్టడం లేదని ప్రశ్నించారు. మేడిగడ్డ పగుళ్లను చూపించి రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చాడని అన్నారు. ఇప్పుడు అన్నారం బ్యారేజీ దగ్గర ఇసుకను యధేచ్చగా తవ్వుతున్నా చూస్తూ ఊరుకోవడం క్షమించరాని నేరం అన్నారు ప్రకాష్.
దీంతో నీటి ప్రవాహం పెరిగినప్పుడు అన్నారం బ్యారేజీ కూలిపోతుందని, అప్పుడు అది కూడా కేసీఆర్ మీదే తొయ్యాలని రేవంత్ రెడ్డి చూస్తున్నాడంటూ వాపోయారు.
