అమెరికా : అమెరికా దేశ ప్రభుత్వం సంచలన ప్రకటన చేసింది. తమకు వ్యతిరేకంగా భావించే రష్యాకు సైతం డిసెంబర్ నెలలో జరిగే జీ20 శిఖరాగ్ర సదస్సుకు రావాల్సిందిగా కోరినట్లు వెల్లడించింది. ప్రస్తుతం ఐదవ సంవత్సరంలో ఉన్న రష్యా-ఉక్రెయిన్ యుద్ధాన్ని ముగించేందుకు కొత్తగా జరుగుతున్న ప్రయత్నాల నేపథ్యంలో ఈ అమెరికా ఆహ్వానం అందింది. న్యూయార్క్‌లో జరిగిన 81వ ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశాల సందర్భంగా రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్‌తో సమావేశమైన అనంతరం విలేకరుల సమావేశంలో అమెరికా విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియో మాట్లాడారు. డిసెంబర్‌లో మయామిలో జరిగే జీ20 శిఖరాగ్ర సమావేశానికి రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌ను అమెరికా ఆహ్వానించిందని విదేశాంగ కార్యదర్శి ఇక్కడ తెలిపారు. ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశాల సందర్భంగా రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్‌తో సమావేశమైన కొద్దిసేపటికే రూబియో ఈ వ్యాఖ్యలు చేశారు.
కేవలం అధ్యక్షుడితోనే కాకుండా ఇతర ప్రపంచ నాయకులతో కూడా ఆయన మమేకం అయ్యేందుకు ఇది ఒక అవకాశమని తాము భావిస్తున్నట్లు చెప్పారు. ఆయన ఈ ఆహ్వానాన్ని అంగీకరిస్తారని ఆశిస్తున్నామని పేర్కొన్నారు. ఇదిలా ఉండగా రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ఐదవ సంవత్సరంలోకి ప్రవేశించింది. ఈ యుద్ధాన్ని ముగించేందుకు జరుగుతున్న కొత్త ప్రయత్నాల నేపథ్యంలో అమెరికా ఈ ఆహ్వానం పంపింది. ఉక్రెయిన్ యుద్ధంపై చర్చల కోసం అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, పుతిన్‌ను కలుస్తారా అని అడగ్గా, అధ్యక్షుడు తాను విభేదించే వారితో సహా ఎవరితోనైనా చర్చలకు సిద్ధంగా ఉన్నారని రూబియో అన్నారు. వారు ఫోన్‌లో చాలాసార్లు మాట్లాడుకున్నారు. ఎన్నిసార్లు అనేది నాకు తెలియదు, కానీ అధ్యక్షుడు పదవిలోకి వచ్చినప్పటి నుండి, వారు కనీసం డజను సార్లు మాట్లాడుకున్నారని నేను అనుకుంటున్నాను. కాబట్టి తాము చర్చలకు సిద్ధంగానే ఉంటామని వెల్లడించారు రూబియో .
