ఢిల్లీ : కేంద్ర మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ ఏపీ రాష్ట్రానికి తీపి కబురు చెప్పారు. గుంటూరు జిల్లా వాసులకు మెరుగైన ఆరోగ్య సేవలు అందించాలని కృత నిశ్చయంతో ఉన్నారు. ఓ వైపు కేంద్ర మంత్రిగా బిజీగా ఉన్నప్పటికీ అభివృద్ది విషయంలో ఏమాత్రం రాజీ పడడం లేదు. ఇప్పటికే తాను ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గాన్ని అన్ని రంగాలలో అభివృద్ది చేయాలని కంకణం కట్టుకున్నారు. ఈ మేరకు తన వంతుగా ప్రయత్నం చేస్తున్నారు. కేంద్ర మంత్రిగా ఆయనకు వంద మార్కులు పడ్డాయి. నిరంతరం తనకు సంబంధించిన శాఖపై పట్టు సాధిస్తూనే ఇంకో వైపు అభివృద్ది వైపు ఎలా తీసుకు వెళ్లాలనే దానిపై దృష్టి సారించారు.
టీడీపీలో అత్యధిక ఆస్తులు, ఆదాయం కలిగిన ఏకైక నాయకుడిగా గుర్తింపు పొందారు. అమెరికాలో వ్యాపారాలను, కంపెనీలను వదిలేసి కేవలం తన స్వస్థలం అభివృద్ది కోసం రాజకీయాలలోకి వచ్చారు. ఇదిలా ఉండగా కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమం, ఆయుష్ మంత్రిత్వ శాఖ మంత్రి ప్రతాపరావు జాదవ్ ను మర్యాద పూర్వకంగా కలిశారు కేంద్ర మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్. గుంటూరు జిల్లా నడింపలెంలో ప్రతిపాదిత 100 బెడ్ల ఆసుపత్రితో పాటు సెంట్రల్ యోగ, నేచరోపథీ ఇన్స్టిట్యూట్‌ను త్వరగా పూర్తి చేసే విషయంపై చర్చించారు. ఈ ప్రాజెక్ట్ పూర్తయితే, ఆంధ్రప్రదేశ్ ప్రజలకు మరింత మెరుగైన, ఆధునిక ఆరోగ్య సేవలు అందుబాటులోకి వస్తాయని అన్నారు. ప్రాంత అభివృద్ధికి, ప్రజల ఆరోగ్య భద్రతకు ఇది ఒక ముఖ్యమైన ముందడుగుగా నిలుస్తుందనడంలో సందేహం లేదని పేర్కొన్నారు డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్.
















