హైదరాబాద్ : కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆయన తెలంగాణలో కొలువు తీరిన రేవంత్ రెడ్డి సర్కార్ ను ఆకాశానికి ఎత్తేశారు. అద్భుతంగా పాలన సాగుతోందంటూ కితాబు ఇచ్చారు. దీంతో కాంగ్రెస్, బీజేపీ మధ్య బంధం బాగుందనే విషయం అర్థమై పోయింది. అభివృద్ది చేసే విషయంలో కాంగ్రెస్ సర్కార్ సూపర్ అంటూ కితాబు ఇచ్చారు కిషన్ రెడ్డి. ఇప్పటికే సవాలక్ష సమస్యలతో సతమతం అవుతోంది రాష్ట్రం. రైతులు, విద్యార్థులు, నిరుద్యోగులు, ప్రజలు నానా తంటాలు పడుతున్నారు. ఇవేవీ పట్టించుకోకుండా సర్కార్ ను పొగడటం పట్ల పలువురు మేధావులు మండిపడ్డారు కిషన్ రెడ్డి తీరుపై.
అభివృద్ధి విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం కేంద్రంతో కలిసి వస్తోందని పేర్కొన్నారు. ఇదే సమయంలో బీఆర్ఎస్ ప్రభుత్వంలో పరిస్థితి వేరేలా ఉండేదన్నారు. ఆనాడు సీఎంగా ఉన్న కేసీఆర్ అహంకారం చూపించే వాడని ఆరోపించారు. అభివృద్ధి కార్యక్రమాల కోసం ప్రధాని వచ్చినా అప్పటి సీఎం పట్టించు కోలేదంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు జి. కిషన్ రెడ్డి. ఇప్పుడు ఆ పరిస్థితి మారిందన్నారు. సీఎంగా రేవంత్ రెడ్డి రాష్ట్రంలో వచ్చాక మార్పు వచ్చిందన్నారు. ఎన్నికల సమయంలోనే రాజకీయాలు చేయాలే తప్పా వ్యక్తిగత భేషజాలకు పోకూడదన్నారు. ఒకవేళ విధాన పరమైన అభ్యంతరాలు ఉంటే ప్రొటెస్ట్ చేయొచ్చని పేర్కొన్నారు.
















