బీసీ బిల్లుపై ప్రధానితో చర్చిస్తా : వీరేంద్ర కుమార్

బీసీ జేఏసీ నేత‌ల‌కు హామీ ఇచ్చిన కేంద్ర మంత్రి

hellotelugu-MinisterVeernedraKumar

న్యూఢిల్లీ : తెలంగాణ రాష్ట్రంలో బీసీల‌కు 42 శాతం రిజ‌ర్వేష‌న్ల సౌక‌ర్యం క‌ల్పించేందుకు ఉద్దేశించిన బిల్లుకు సంబంధించి దేశ ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోదీతో తాను త‌ప్ప‌కుండా చ‌ర్చిస్తాన‌ని స్ప‌ష్టం చేశారు కేంద్ర సామాజిక‌, న్యాయ సాధికార శాఖ మంత్రి వీరేంద్ర కుమార్. బుధ‌వారం త‌న‌ను మ‌ర్యాద పూర్వ‌కంగా క‌లిశారు బీఆర్ఎస్ పార్టీ ఎంపీ ఒద్దిరాజు ర‌విచంద్ర నేతృత్వంలో బీసీ జేఏసీ నేత‌లు. ఈ సంద‌ర్బంగా కేంద్ర మంత్రితో సుదీర్ఘంగా చ‌ర్చించారు. ఆయ‌న‌కు విన‌తిప‌త్రం స‌మ‌ర్పించారు. పార్ల‌మెంట్ లో బీఆర్ఎస్ బీసీల‌కు రిజ‌ర్వేష‌న్లు క‌ల్పించాల‌ని కోరుతూ ప్రైవేట్ బిల్లును ప్ర‌వేశ పెట్టామ‌న్నారు ఎంపీ ర‌విచంద్ర‌. ప్రైవేటు బిల్లుకు కూడా కేంద్ర ప్రభుత్వం మద్దతు తెలిపి బీసీ బిల్లు ఆమోదానికి కృషి చేయాలని ఆయన కేంద్ర మంత్రి కోరారు .

ఇదిలా ఉండ‌గా బిసి జేఏసీ నేతలు చెప్పిన డిమాండ్లను ఓపికగా విన్న కేంద్ర సామాజిక న్యాయ సాధికారత మంత్రి వీరేంద్ర కుమార్ స్పందించారు. బీసీ రిజర్వేషన్లకు తాము వ్యతిరేకం కాదని స్ప‌ష్టం చేశారు. ఇందిరా సహాని కేసు లో సుప్రీం కోర్టు తీర్పు సామాజిక రిజర్వేషన్లు 50 శాతం పరిమితి మించొద్దని తీర్పు ఇచ్చింద‌ని గుర్తు చేశారు. కేంద్ర ప్రభుత్వం వివిధ రాష్ట్రాల నుండి బీసీ రిజర్వేషన్లు పెంచాలని వచ్చిన విజ్ఞప్తులను నిశితంగా ప‌రిశీలిస్తోంద‌ని చెప్పారు కేంద్ర మంత్రి. దేశంలో అందరికీ సమ న్యాయం జరగాలని తమ ప్రభుత్వ లక్ష్యమని స్ప‌ష్టం చేశారు. అందుకే వచ్చే ఏడాది నుండి దేశ వ్యాప్తంగా జనగణలో కూడా కులగణన చేపడుతున్నామని తెలిపారు . త్వ‌రలో పీఎంతో చ‌ర్చిస్తాన‌ని వీరేంద్ర కుమార్ హామీ ఇచ్చారు.

Exit mobile version