అమరావతి : ఆక్వా ఫీడ్ ధరల పెంపు విషయం తెలిసిన వెంటనే ప్రభుత్వం వేగంగా స్పందించిందని మంత్రి అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు. మత్సశాఖ కమిషనర్ ద్వారా వెంటనే నోటీసులు జారీ చేశాం అన్నారు. ప్రభుత్వం కఠిన చర్యలకు సిద్ధమవుతోందని తెలుసుకున్న ఫీడ్ కంపెనీలు వెనక్కి తగ్గాయన్నారు. ధరల పెంపును ఉపసంహరించు కుంటున్నట్లు ప్రకటన కూడా చేశాయన్నారు. రైతులు ఊపిరి పీల్చుకున్నారని తెలిపారు. ఇవన్నీ కనిపించకుండా రాజకీయ డ్రామాలు చేయడం మానుకోవాలి అని మంత్రి జగన్ రెడ్డికి హితవు పలికారు. APSADA చట్టంపై కీలక సమావేశం నిర్వహించి, ఫీడ్ తయారీ సంస్థలు, రైతులు, అధికారులతో చర్చించి చట్ట ప్రకారం తదుపరి చర్యలు తీసుకోనున్నట్లు వెల్లడించారు.
జగన్ పాలనలో ఆక్వా రంగం తీవ్రంగా దెబ్బతిన్నదని మంత్రి పేర్కొన్నారు. విద్యుత్ ఛార్జీలు, డీజిల్ ధరలు, రవాణా వ్యయాలు, ఫీడ్ ధరలు పెరిగి రైతులు అప్పుల పాలయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నో కుటుంబాలు నష్టాలతో కుదేలయ్యాయని మండిపడ్డారు. చెరువులు మూతపడ్డాయి. ఎగుమతులు దెబ్బతిన్నాయి. ఫిషరీస్ శాఖను నిర్వీర్యం చేసింది మీ ప్రభుత్వమే అని విమర్శించారు అచ్చెన్నాయుడు. 1.50 రూపాయలకు యూనిట్ విద్యుత్ ఇస్తామని చెప్పి ‘10 ఎకరాల పరిమితి’, ‘జోన్-నాన్ జోన్ వంటి నిబంధనలను పెట్టి ఏ రైతుని కూడా రైతులను ఇబ్బందులకు గురిచేశారని ఆరోపించారు. మీ పాలనలో ఆక్వా రైతుల జీవితాలు బుగ్గిపాలు అయ్యాయని , దీనికి జగన్ రెడ్డి బాధ్యత వహించాల్సి ఉంటుందన్నారు. రైతుల భవిష్యత్తుతో ఆడుకున్న వారు ఇప్పుడు రైతుల రక్షకుల్లా మాట్లాడటం ప్రజలు గమనిస్తున్నారు అని అన్నారు.
