చెన్నై : డీఎంకే ప్రతిపక్ష నేత ఉదయనిధి స్టాలిన్ సీరియస్ కామెంట్స్ చేశారు. రాష్ట్రంలో రీల్స్ ప్రభుత్వం నడుస్తోందని ఎద్దేవా చేయడం కలకంల రేపింది. ప్రధానంగా తాజాగా సీఎం విజయ్ ఎమ్మెల్యేలకు కొత్త వాహనాలను కేటాయించడాన్ని తీవ్రంగా తప్పు పట్టారు. ఓ వైపు ఆర్థిక పరిస్థితి బాగోలేదని అంటూనే ఇంకో వైపు వాహనాలు ఎలా కొనుగోలు చేస్తారంటూ ప్రశ్నించారు. ఇది మంచి పద్దతి కాదన్నారు. ఆయన తీవ్ర అభ్యంతరం తెలిపారు. ఈ నిర్ణయాన్ని సీఎం వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు ఉదయనిధి స్టాలిన్. అంతే కాకుండా డీఎంకేపై చేసిన అనేక నిరాధారమైన ఆరోపణలను స్పీకర్ రికార్డుల నుండి తొలగించినప్పటికీ, ఆ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయని పేర్కొన్నారు; దీనిపై స్పీకర్ ఎటువంటి చర్యలు తీసుకోబోతున్నారో తెలుసు కోవాలని ఆయన కోరారు. చెన్నైలో జరుగుతున్న అసెంబ్లీ సమావేశాల్లో ప్రతిపక్ష నాయకుడు నిప్పులు చెరిగారు.
అసెంబ్లీ కార్యకలాపాలు ప్రత్యక్ష ప్రసారం అవుతుండటంతో స్పీకర్ తొలగించిన వ్యాఖ్యలు సోషల్ మీడియా ఛానెళ్లలో ‘రీల్స్’ రూపంలో కనిపిస్తుండటంపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. అయితే, డీఎంకే హయాంలోనే ‘ప్రశ్నోత్తరాల సమయం’ టీవీలో ప్రత్యక్ష ప్రసారం చేయడం ప్రారంభించారని గుర్తుచేస్తూ, ఆ ప్రత్యక్ష ప్రసార విధానం తమదేనని ఆయన పేర్కొన్నారు. గతంతో పోలిస్తే అభ్యంతరకరమైన వ్యాఖ్యలను స్పీకర్ ఎక్కువగా తొలగించినందుకు అభినందనలు తెలుపుతూనే, ఆ వ్యాఖ్యలు యూట్యూబ్ ఛానెళ్లలో రీల్స్‌గా ప్రసారం కావడం దురదృష్టకరమని ఆయన అన్నారు. సభలో తమ అభిప్రాయాలను వెల్లడించడానికి ప్రతిపక్ష సభ్యులకు స్పీకర్ ఎక్కువ సమయం ఇస్తున్నారని కూడా ఆయన చెప్పారు. డీఎంకేకు సంబంధించిన మూడు ఫైళ్లు తన వద్ద ఉన్నాయని ముఖ్యమంత్రి సి. జోసెఫ్ విజయ్ సభలో చేసిన ఆరోపణను ప్రస్తావిస్తూ, ఉదయనిధి స్టాలిన్ ఆ ఫైళ్లను తెరిచి, వాటిలోని వివరాలను ఎటువంటి జాప్యం లేకుండా బహిర్గతం చేయాలని కోరారు.
















