రూ. 28,840 కోట్ల కేటాయింపుతో ఉడాన్ ప‌థ‌కం

విమానయాన రంగం ఆధారిత అభివృద్ధి

hellotelugu-PMModi

రాజ‌స్థాన్ : రాజ‌స్తాన్ లోని జోధ్‌పూర్ విమానాశ్రయ కొత్త టెర్మినల్‌ను ప్రారంభించారు ప్రధాని న‌రేంద్ర‌ మోదీ. ఆయన సవరించిన ‘ఉడాన్’ పథకాన్ని కూడా శ‌నివారం ప్రారంభించారు. రాబోయే 10 ఏళ్లలో రూ. 28,840 కోట్ల కేటాయింపుతో విమానయాన రంగం ఆధారిత అభివృద్ధి తదుపరి దశను వేగవంతం చేయడం ఈ పథకం లక్ష్యం అని స్ప‌ష్టం చేశారు. రాజస్థాన్‌లోని జోధ్‌పూర్ విమానాశ్రయంలో కొత్త టెర్మినల్ భవన ప్రారంభోత్సవ కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ, రాజస్థాన్ గవర్నర్ హరిభౌ బగ్డే, కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కె. రామ్మోహన్ నాయుడు, కేంద్ర సాంస్కృతిక , పర్యాటక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్, ముఖ్యమంత్రి భజన్‌లాల్ శర్మ తదితరులు పాల్గొన్నారు.

ప్రధాని రిమోట్ బటన్ నొక్కి ప్రారంభోత్సవ ఫలకాన్ని ఆవిష్కరించి, కొత్త టెర్మినల్ భవనాన్ని పరిశీలించారు. సమగ్రమైన, సుస్థిరమైన విమాన రవాణా అనుసంధానాన్ని కల్పించేందుకు ఈ సవరించిన పథకం అనేక వ్యూహాత్మక అంశాలపై దృష్టి సారిస్తుందని ప్ర‌క‌టించారు ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోదీ. జోధ్‌పూర్ విమానాశ్రయంలోని కొత్త టెర్మినల్ భవనం మొత్తం రూ. 480 కోట్ల వ్యయంతో నిర్మించారు. 23,000 చదరపు మీటర్ల కంటే ఎక్కువ విస్తీర్ణంలో ఉన్న ఈ టెర్మినల్, ఏటా 20 లక్షల మంది ప్రయాణికులకు సేవలందించేలా రూపొందించబడింది.

ప్రయాణికులకు సౌకర్యవంతమైన, సులభమైన ప్రయాణ అనుభవాన్ని అందించేందుకు ఈ టెర్మినల్‌లో ఆధునిక వసతులు కల్పించారు. రాజస్థాన్ రాజసం ఉట్టిపడే వారసత్వ శైలి స్ఫూర్తితో నిర్మించిన ఈ టెర్మినల్, తోరణాలు , జరోఖాల వంటి సాంప్రదాయ అంశాలను ఆధునిక డిజైన్‌తో మిళితం చేస్తుంది. కొత్త టెర్మినల్‌ను ప్రధాని సందర్శించిన సమయంలో జానపద కళాకారులు సాంస్కృతిక ప్రదర్శనలు ఇచ్చారు.

Exit mobile version