చెన్నై : తమిళనాడు సీఎం జోసెఫ్ విజయ్ చంద్రశేఖర్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ‘సింగం ఉమెన్స్ థండర్‌బోల్ట్ స్క్వాడ్’ ప్రారంభోత్సవానికి 1200 మంది తమ పార్టీకి చెందిన సభ్యులకు అనుమతి ఇచ్చారు. ఇది ప్రస్తుతం రాష్ట్రంలో చర్చకు దారితీసేలా చేసింది. ఇతర ముఖ్యమంత్రులు చేయని పనిని చేస్తున్నారు విజయ్. గతంలో డీఎంకే , అన్నాడీఎంకే ప్రభుత్వాల హయాంలో పోలీసు శాఖకు సంబంధించిన కార్యక్రమాల్లో కేవలం పోలీసు సిబ్బంది, అధికారులు మాత్రమే పాల్గొనేవారు. జయలలిత, కరుణానిధి, స్టాలిన్ వంటి ముఖ్యమంత్రులు తమ పార్టీ కార్యకర్తలను పోలీసు కార్యక్రమాల్లో పాల్గొనడానికి అనుమతించేవారు కాదు. అయితే ఇవాళ ఎస్ప్లానేడ్‌లోని రాజరత్నం స్టేడియంలో జరగనున్న ‘సింగం ఉమెన్స్ థండర్‌బోల్ట్ స్క్వాడ్’ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ‘తమిళగ వెట్రి కళగం’ కు చెందిన 1200 మంది సభ్యులకు ఆహ్వానాలు పంపారు. ముఖ్యమంత్రి విజయ్ ప్రారంభించనున్న ఈ కార్యక్రమంలో వారు పాల్గొనబోతున్నారు.
ఇటువంటి కార్యక్రమాల్లో పార్టీ కార్యకర్తలను అనుమతించ వద్దని పోలీసు అధికారులు పదేపదే సూచించినప్పటికీ, వారి విజ్ఞప్తులను తిరస్కరించారు. రేపటి కార్యక్రమంలో పోలీసుల కవాతు (మార్చింగ్ పరేడ్) ఉంటుంది. ముఖ్యమంత్రికి గౌరవ సూచకంగా జరిగే ఈ పరేడ్ సమయంలో, పార్టీ సభ్యులు ఈలలు వేస్తూ ఉత్సాహంగా కేరింతలు కొట్టే అవకాశం ఉంది. అటువంటి సమయంలో, పరేడ్‌లో పాల్గొనే పోలీసు సిబ్బందికి అనేక ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదురవుతాయి. అంతే కాకుండా పోలీసు కార్యక్రమంలో పార్టీ సభ్యులు ప్రదర్శించే ప్రతి ఉత్సాహ పూరిత చర్య పోలీసులకు తీవ్ర అసౌకర్యాన్ని కలిగిస్తుంది. కాబట్టి, ఇతర ముఖ్యమంత్రుల మాదిరిగానే కూడా పోలీసు కార్యక్రమాల్లో పార్టీ కార్యకర్తలను పాల్గొనకుండా చూడాలని పోలీసులు కోరుతున్నారు.
