గాంధీ విగ్ర‌హం కోసం పేద‌ల ఇళ్లు కూల్చితే ఎలా..?

తెలంగాణ ప్ర‌భుత్వం తీరుపై గాంధీ మ‌నుమ‌డు ఫైర్

hellotelugu-TussharGandhi

హైద‌రాబాద్ : మూసీ ప్రాజెక్టు పేరుతో ఎన్నో ఏళ్లుగా ఇళ్లు క‌ట్టుకున్న పేద‌ల‌ను బ‌ల‌వంతంగా ఖాళీ చేయించాల‌ని చూస్తున్న రేవంత్ రెడ్డి స‌ర్కార్ పై సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు దివంగత మ‌హాత్మా గాంధీ మ‌న‌వ‌డు తుషార్ గాంధీ. గాంధీ విగ్ర‌హం కోసం ఇళ్ళని కూల్చొద్దని కోరారు. ఇళ్ళని కూల్చి గాంధీ విగ్ర‌హ స్థ‌లం సేక‌రించ‌డం గాంధేయ విధానం కాదని స్పష్టం చేశారు . ఒక‌వేళ గాంధీ బ్రతికుంటే నా పేరుతో ఇలాంటి ప‌నులు చేయొద్దని చెప్పేవారని హితవు ప‌లికారు. రూ.5000 కోట్లతో మూసీ నది ఒడ్డున భారీ గాంధీ విగ్రహం ప్లాన్ చేశారు సీఎం రేవంత్ రెడ్డి. ఈసి, మూసీ నదుల సంగమం వద్ద పది ఎకరాల భూసేకరణకు నోటిఫికేషన్ విడుదల కూడా చేసింది స‌ర్కార్. ఈ ప్రాజెక్టు కోసం 3,279 ఎకరాలు, 10,017 ఇల్లు, షాపులను కూల్చేయనుంది.

దీని కార‌ణంగా రోడ్డున ప‌డ‌నున్నాయి వేలాది కుటుంబాలు. దీంతో గాంధీ విగ్ర‌హం ఎవ‌రి కోసం కావాల‌ని స్థానికులు, బాధితులు ప్ర‌శ్నిస్తున్నారు. తెలంగాణ స‌ర్కార్ అనుస‌రిస్తున్న తీరు ప‌ట్ల ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు. ఇల్లు కూలుస్తామంటే ఊరుకోమంటూ బాధితులు హెచ్చ‌రించారు. స్థానికులు, ప్ర‌జా సంఘాలు పెద్ద ఎత్తున ఆందోళ‌న బాట ప‌ట్టాయి. తెలంగాణ ప్ర‌భుత్వం త‌క్ష‌ణ‌మే విడుద‌ల చేసిన జీవోను వెంట‌నే ఉప సంహ‌రించు కోవాల‌ని డిమాండ్ చేశారు. లేక పోతే తీవ్ర ప‌రిణామాలు ఎదుర్కోవాల్సి వ‌స్తుంద‌ని హెచ్చ‌రించారు.

Exit mobile version