రికార్డు స్థాయిలో టీటీడీ భక్తుల ల‌గేజీ డెలివరీ సేవ‌లు

అర కోటి మందికి పైగా భ‌క్తుల‌కు ల‌గేజీ సురక్షంగా జమ

hellotelugu-TTDLuggage

తిరుమల : శ్రీ వేంకటేశ్వర స్వామివారి దర్శనార్థం తిరుమలకు విచ్చేసే లక్షలాది మంది భక్తులకు సౌకర్యవంతమైన సేవలు అందించేందుకు టీటీడీ విస్తృత స్థాయిలో లగేజీ డిపాజిట్ , డెలివరీ కేంద్రాలను ఏర్పాటు చేసి సమర్థవంతంగా నిర్వహిస్తోంది. భక్తులు శ్రీవారి దర్శనం, కాలినడక యాత్ర సమయంలో తమతో తీసుకువచ్చే లగేజీ, బ్యాగులు, సెల్ ఫోన్లను భద్రంగా ఉంచుకునేందుకు తిరుమలలో , కాలినడక మార్గాల్లో కలిపి మొత్తం 65 కౌంటర్లు ఏర్పాటు చేసి 345 మంది సిబ్బంది మూడు షిఫ్టుల్లో నిరంతరంగా సేవలందిస్తున్నారు.

టీటీడీ కల్పించిన ఈ సేవలను భక్తులు పెద్ద ఎత్తున వినియోగిస్తున్నారు. ఈ నేప‌థ్యంలో ఈ ఏడాది ఏప్రిల్, మే నెల‌ల్లో రికార్డు స్థాయిలో 51,38,976 మంది భ‌క్తులు త‌మ ల‌గేజీని డిపాజిట్ చేసుకున్నారు. గ‌త ఏడాది ఏప్రిల్ లో 20,75,481 మంది భ‌క్తులు త‌మ ల‌గేజీని భ‌ద్రప‌ర‌చుకోగా, ఈ ఏడాది ఏప్రిల్ నెల‌లో 23,15,279 మంది భ‌క్తులు త‌మ ల‌గేజీని భ‌ద్ర‌త ప‌ర‌చుకున్నారు. గ‌త ఏడాది మే నెల‌లో 23,82,622 త‌మ ల‌గేజీని భ‌ద్ర‌ప‌ర‌చుకోగా, ఈ ఏడాది 28,23,697 మంది భ‌క్తులు త‌మ ల‌గేజీని ఉంచారు.

అంటే గ‌త ఏడాది ఏప్రిల్ నెల‌తో పోల్చితే 2,39,798 ల‌గేజీ డిపాజిట్లు, మే నెల‌తో పోల్చితే 4,41,075 ల‌గేజీ డిపాజిట్లు అత్య‌ధికంగా న‌మోదు కావ‌డం విశేషం. అదేవిధంగా తిరుమలలో రద్దీ పెరిగిన నేపథ్యంలో గత మూడు రోజుల్లో 3,41,742 మంది ఉచిత లగేజీ సేవలు వినియోగించుకున్నారు. అలిపిరి, శ్రీవారి మెట్టు కాలినడక మార్గాల ద్వారా తిరుమలకు చేరుకునే భక్తుల కోసం ప్రత్యేక డిపాజిట్ కేంద్రాలు ఏర్పాటు చేశారు.

ఆయా కేంద్రాల్లో లగేజీ డిపాజిట్ చేసిన భక్తులు తిరుమలలోని డెలివరీ కేంద్రాల్లో సులభంగా తిరిగి పొందే సౌకర్యాన్ని టీటీడీ కల్పించింది. టీటీడీ లగేజీ డిపాజిట్ కేంద్రాల్లో భక్తులు తమ లగేజీని డిపాజిట్ చేసే సమయంలో సిబ్బంది ఫేస్ రికగ్నిషన్ టెక్నాలజీ ద్వారా క్యూఆర్ కోడ్ జెనరేట్ చేసి బ్యాగుపై కోడ్ స్కిక్కర్ వేస్తారు. ఆ తర్వాత లగేజీకి సంబంధించిన సమాచారంతో ఒక స్లిప్ జెనరేట్ చేసి భక్తులకు అందిస్తారు. డిపాజిట్ డెలివరీ సమయంలో డెలివరీ కేంద్రంలో ఆ స్లిప్ సిబ్బందికి చూపితే ఆ నెంబర్ ఆధారంగా లగేజీని సులభంగా గుర్తించి ఒక నిమిషంలోపు లగేజీని భక్తులకు ఇస్తారు.

తిరుమలకు విచ్చేసే భక్తులు తమ వద్ద ఉన్న లగేజీ, బ్యాగులు, సెల్ ఫోన్లను అధికారిక డిపాజిట్ కేంద్రాల్లో భద్రపరచి, టోకెన్ ఆధారంగా తిరిగి పొందాలని టీటీడీ విజ్ఞప్తి చేస్తోంది.

Exit mobile version