తిరుపతి : తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో జూన్ 25 నుండి 29వ తేదీ వరకు నిర్వహించనున్న తెప్పోత్సవాల ఏర్పాట్లను టిటిడి జేఈవో డా. ఎ. శరత్ అధికారులతో కలిసి పరిశీలించారు. ఉత్సవాలకు విచ్చేసే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు పకడ్బందీగా చేపట్టాలని సంబంధిత అధికారులను ఆదేశించారు . ఉత్సవాలకు విచ్చేసే వేలాది మంది భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా భద్రత, పారిశుద్ధ్యం, విద్యుత్, తాగునీరు, దర్శన సౌకర్యాలు తదితర అంశాల్లో పకడ్బందీ చర్యలు చేపట్టాలని అన్నారు.
తెప్పోత్సవాల్లో వినియోగించే తెప్పల ఫిట్‌నెస్‌ను పూర్తిగా పరిశీలించి ట్రయల్ రన్ నిర్వహించాలని జేఈవో సూచించారు. అలాగే విద్యుద్దీపాల కాంతులతో, పుష్పాల అలంకరణలతో తెప్పలను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దాలని అధికారులను ఆదేశించారు జేఈవో. ఉత్సవాల సందర్భంగా టీటీడీ హిందూ ధర్మప్రచార పరిషత్, అన్నమాచార్య ప్రాజెక్టు, దాససాహిత్య ప్రాజెక్టుల ఆధ్వర్యంలో ప్రతిరోజూ భక్తి సంగీత కచేరీలు, ఆధ్యాత్మిక ప్రవచనాలు, భజనలు, కోలాటాలు, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు జేఈవో తెలిపారు. ఈ కార్యక్రమాలు భక్తులకు ఆధ్యాత్మికానందాన్ని పంచనున్నాయని పేర్కొన్నారు. అధిక సంఖ్యలో పాల్గొని శ్రీ పద్మావతి అమ్మవారి కృపా కటాక్షాలకు పాత్రులు కావాలని జేఈవో భక్తులను కోరారు.


















