TTD EO : తిరుపతి – మన వేదాలు, పురాణాల్లో పేర్కొన్న విధంగా సకల దేవతాస్వరూపాలైన గోవులను భక్తుల భాగస్వామ్యంతో రక్షించుకోవడం ద్వారా భారతీయ హైందవ సంస్కృతిని కాపాడుకుందామని టిటిడి ఈవో (TTD EO) జె.శ్యామల రావు ఉద్ఘాటించారు. తిరుపతిలోని శ్రీ వేంకటేశ్వర గో సంరక్షణశాలలో శనివారం గోకులాష్టమి సందర్బంగా గో పూజ మహోత్సవ వేడుకలు వైభవంగా జరిగాయి.
TTD EO J Shyamala Rao Interesting Comments
ఈ సందర్భంగా టిటిడి ఈవో (TTD EO) మాట్లాడుతూ భారతీయ హైందవ సంప్రదాయంలో గోవులకు విశేషమైన స్థానం ఉందన్నారు. శ్రీ వేంకటేశ్వర గో సంరక్షణశాలలో మొత్తం 2,789 గోవులు ఉన్నాయని, అందులో 1827 ఆవులు, 962 ఎద్దులు, 7 ఏనుగులు , 5 గుర్రాలు ఉన్నట్లు తెలిపారు. ప్రతిరోజు తిరుమల, తిరుపతి, తిరుచానూరు గోశాలల్లో, అలిపిరి వద్ద గల సప్త గో ప్రదక్షిణ మందిరంలో “గోపూజ” నిర్వహించడం జరుగుతోందన్నారు.
ప్రతిరోజు తిరుమల శ్రీవారి ఆలయంతో పాటు ఇతర అనుబంధ ఆలయాలలో పూజా కైంకర్యాల నిమిత్తం దేశవాళీ గోవుల పాలు, పెరుగు, వెన్న, నెయ్యిని గోశాల నుండి సరఫరా చేస్తున్నట్లు చెప్పారు . దైవ కార్యక్రమాలకే కాకుండా టీటీడీ (TTD) పరిధిలోని వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లలో వేచి ఉండే భక్తులకు, చంటి బిడ్డలకు, వృద్ధులకు, అన్నప్రసాద వితరణ కేంద్రాలు, క్యాంటీన్లు, విద్యా సంస్థలు, ఆసుపత్రులకు ప్రత్యేకంగా పాలను సరఫరా చేస్తున్నట్లు తెలియజేశారు.
పిండ మార్పిడి విధానము (Embryo Transfer Technology) ద్వారా మేలు రకమైన దేశవాళీ గోజాతిని అభివృద్ధి చేసేందుకు టీటీడీ – శ్రీ వేంకటేశ్వర పశు వైద్య విశ్వ విద్యాలయంతో (MOU) చేసుకున్నామన్నారు. ఇప్పటి వరకు పిండ మార్పిడి విధానంలో 47 మేలు రకమైన “సాహివాల్” జాతి దూడలు జన్మించినట్లు తెలిపారు.
ఉత్తమమైన దేశవాళీ గోజాతి పరిరక్షణలో భాగంగా, ఇప్పటివరకు 539 దేశవాళీ గోవులను దాతల సహకారంతో తిరుపతిలోని శ్రీ వేంకటేశ్వర గోసంరక్షణ శాలకు తీసుకుని రావడం జరిగిందన్నారు. ప్రస్తుతం మరో 500 ల దేశవాళీ గిర్, కాంక్రేజ్, థార్పార్కర్, రెడ్ సింధీ తదితర ఆవులను దాతల సహకారంతో ఎస్వీ గోశాలకు తీసుకురానున్నట్లు చెప్పారు.
టీటీడీ దేశవ్యాప్తంగా 195 ఆలయాలకు ఉచితంగా ఆవు, దూడలను అందించినట్లు తెలిపారు. అదేవిధంగా టీటీడీ అనుబంధ ఆలయాలలో “గుడికో గోమాత” పథకం ద్వారా గోశాల నుండి అందించిన గోమాతలకు భక్తులు నిత్యం “గోపూజ ” నిర్వహిస్తున్నారన్నారు.
గోశాలలో రూ.12.25 కోట్లతో “ఎస్వీ పశుదాణా తయారీ కేంద్రం” ఏర్పాటు చేసినట్లు తెలియజేశారు. ఇందులో గోశాలలలో ఉన్న దేశవాళీ గోవుల ఆరోగ్య పరిరక్షణ, అధిక పాల ఉత్పత్తికి అవసరమైన, నాణ్యమైన మేలురకపు “సమతుల్య పశుదాణా”ను ఉత్పత్తి చేసి, సరఫరా చేయడం జరుగుతోందన్నారు. పశువుల ఆరోగ్య పరిరక్షణ, పోషణ, నిర్వహణ, సంతానోత్పత్తి, సంక్షేమ కార్యకలాపాలపై విలువైన సలహాలు, సిఫార్సులు అందించేందుకు, టిటిడి గోశాలలో జరుగుతున్న సాధారణ కార్యకలాపాలను మరింత మెరుగు పరచడానికి గోశాల నిపుణులు కమిటీని ఏర్పాటు చేసామన్నారు.
ముందుగా టిటిడి ఈవో (TTD EO) గజరాజులకు పండ్లు అందించిన అనంతరం వేణుగోపాల స్వామివారిని దర్శించుకున్నారు. అక్కడి నుంచి గో మందిరానికి చేరుకుని, గోవు, దూడకు శాస్త్ర బద్ధంగా పూజలు నిర్వహించి పూల దండలు వేసి, నూతన వస్త్రాలు సమర్పించారు. దాణా, మేత తినిపించారు.
ఈ సందర్భంగా అన్నమాచార్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో అన్నమయ్య సంకీర్తనల ఆలాపన, దాస సాహిత్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో భజనలు, కోలాటాలు నిర్వహించారు. సాయంత్రం 6.30 నుండి 8.30 గంటల వరకు హిందూ ధర్మప్రచార పరిషత్ కళాకారులు హరికథా పారాయణం చేశారు.
గోశాల సంచాలకులు శ్రీనివాస్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు, సివి అండ్ ఎస్ వో మురళీకృష్ణ, టిటిడి ఎక్స్ అఫిషియో మెంబర్ సి.దివాకర్ రెడ్డి ఇతర అధికార ప్రముఖులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.
Also Read : TTD Proven – Subrahmanya Swamy : శ్రీ సుబ్రమణ్య స్వామికి శ్రీవారి సారె



















