TTD EO Anil Kumar : తిరుపతి : తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలు నవంబర్ 17 నుండి 25వ తేదీ వరకు జరుగనున్న నేపథ్యంలో పటిష్ట కార్యాచరణతో సక్సెస్ చేయాలని టిటిడి ఈవో అనిల్ కుమార్ సింఘాల్ (TTD EO Anil Kumar) అధికారులను ఆదేశించారు. తిరుచానూరు ఆస్థాన మండంలో బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై తిరుపతి జిల్లా కలెక్టర్ డా. ఎస్. వెంకటేశ్వర్, జేఈవో వి. వీరబ్రహ్మం, జిల్లా ఎస్పీ ఎల్. సుబ్బరాయుడు, టిటిడి సీవీఎస్వో కే. వి. మురళీకృష్ణ లతో కలసి సమీక్ష నిర్వహించారు.
TTD EO Anil Kumar Singhal Key Update
ఈ సందర్భంగా ఈవో అనిల్ కుమార్ సింఘాల్ (TTD EO Anil Kumar) మాట్లాడారు. తిరుచానూరు బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై ఇప్పటికే రెండుమార్లు జిల్లా ఎస్పీ, టిటిడి సివిఎస్వో, టిటిడి జేఈవో సమీక్ష నిర్వహించారని తెలిపారు. తిరుచానూరు ఆలయం పరిసరాలలోను, పద్మ సరోవరం, హోల్డింగ్ పాయింట్లు వద్ద అవసరమైన బందోబస్తు ఏర్పాటు చేయాలని సూచించారు. పంచమి తీర్థం రోజు దాదాపు 75 వేల మందికి పైగా భక్తులు వచ్చే అవకాశం ఉందని అందుకు తగ్గట్లు అన్న ప్రసాదాలు సిద్ధం చేసుకోవాలని, పటిష్ట క్యూలైన్లు, జర్మన్ షెడ్లు, పారిశుద్ధ్య పనులు, వర్షం వచ్చినా భక్తులకు ఇబ్బందులు లేకుండా పటిష్ట చర్యలు చేపట్టాలన్నారు. దాదాపు 600 మంది పోలీసులు, 700 మంది టిటిడి సెక్యూరిటీ , 900 మంది శ్రీవారి సేవకులు, 2 వేల మంది పారిశుద్ధ్య కార్మికులు సేవలు అందిస్తారన్నారు.
అదేవిధంగా రోజువారి 10 వేల మందికి అన్న ప్రసాదాలు, పంచమి తీర్థం రోజున హోల్డింగ్ పాయింట్లలో దాదాపు 25 వేల మందికి పైగా భక్తులు వేచియుండే అవకాశం ఉందన్నారు ఈవో. తిరుమల తరహాలో విద్యుత్ దీపాలంకరణలు, పుష్పాలంకరణలు చేపట్టాలని సూచించారు. భక్తులకు ఎక్కడా ఇబ్బంది లేకుండా కమాండ్ కంట్రోల్ సెంటర్ లో అన్ని శాఖల అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షించి చర్యలు చేపడుతారన్నారు ఈవో సింఘాల్. శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలకు భారత ఉప రాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ వచ్చారని, శ్రీ పద్మావతీ అమ్మవారి బ్రహ్మోత్సవాలకు భారత రాష్ట్రపతి ద్రౌపతి ముర్ము వస్తున్నారని చెప్పారు. తిరుచానూరులో భారత రాష్ట్రపతి పర్యటన నేపథ్యంలో పటిష్ట ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు.
Also Read : MLC Sravan Kumar Fired on By Election : జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో అక్రమాలకు తెర లేపారు
