576 హెక్టార్లలో టీటీడీ స్వదేశీ మొక్కల పెంపకం

ప‌చ్చ‌ద‌నంతో అల‌రిస్తున్న తిరుమ‌ల

hellotelugu-TTDGarden

తిరుమ‌ల : జీవ వైవిధ్య పరిరక్షణలో భాగంగా విదేశీ జాతికి చెందిన అకేషియా చెట్ల స్థానంలో స్థానిక వృక్ష సంపదను పునరుద్ధరించే కార్యక్రమాన్ని టీటీడీ చేపట్టింది. ఈ మేరకు 576 హెక్టార్లలో స్థానిక జాతులైన రావి, మర్రి, జువ్వి, మేడి, సంపంగి, మామిడి, గంధం, ఎర్రచందనం, ఉసిరి, నేరేడు వంటి మొక్కలను దశల వారీగా నాటుతున్నారు. ఇప్పటి వరకు 22 హెక్టార్లలో పనులు పూర్తయ్యాయి. టీటీడీ పరిధిలోని నాలుగు ఫారెస్ట్ రేంజ్‌లలో ప్రత్యేక నర్సరీలను నిర్వహిస్తూ స్థానిక జాతుల మొక్కలు, అలంకార మొక్కలు, ఔషధ మొక్కలను పెంచుతున్నారు. అటవీ పునరుద్ధరణ కార్యక్రమాలకు అవసరమైన నాణ్యమైన మొక్కలను ఈ నర్సరీల ద్వారా సరఫరా చేస్తున్నారు.

శేషాచల అరణ్యాల్లో ఏనుగులు, చిరుతలు, ఎలుగుబంట్లు, పాములు వంటి అనేక వన్యప్రాణులు నివసిస్తున్నాయి. మానవ వన్యప్రాణి ఘర్షణలను తగ్గించేందుకు, గాయపడిన జంతువులను రక్షించేందుకు టీటీడీ అటవీ విభాగం ప్రత్యేక చర్యలు చేపడుతోంది. వేసవి తీవ్రత దృష్టిలో ఉంచుకుని అటవీ ప్రాంతాల్లో జంతువుల దాహార్తి తీర్చేందుకు సాసర్ పిట్స్ (ప్రత్యేక నీటి గుంతలు) ఏర్పాటు చేసి వాటిలో నీటిని నింపడం జరుగుతోంది. దీంతో నీటి కోసం అడవి జంతువులు మానవ ప్రాంతంల్లోకి వచ్చే అవకాశాలు పూర్తిగా తగ్గడం జరిగింది. అలాగే దర్శన క్యూ లైన్ ప్రాంగణాల్లో మూడు స్నేక్ రెస్క్యూ బృందాలను నిరంతరం అప్రమత్తంగా ఉంచడం జరుగుతోంది.

అదేవిధంగా భక్తుల భద్రతను దృష్టిలో ఉంచుకుని ప్రమాదకరమైన చెట్లను గుర్తించి తొలగించడం, గాలివానల కారణంగా పడిపోయిన చెట్లను తొలగించడం, రహదారుల పక్కన చెట్ల కొమ్మలను క్రమం తప్పకుండా తొలగించడం వంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.

Exit mobile version