TTD : తిరుమల – టీటీడీ చైర్మన్ గా కొలువు తీరిన తర్వాత బీఆర్ నాయుడు దూకుడు పెంచారు. గతంలో నిర్లక్ష్యం వహించడంతో మరింత దృష్టి సారించారు. సుదూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చేసేందుకు చర్యలు చేపట్టారు. ప్రధానంగా రుచికరమైన, నాణ్యమైన ఆహారాన్ని అందించాలని తపన పడ్డారు. ఆ మేరకు మార్పులు తీసుకు వచ్చేలా చేయడంలో సక్సెస్ అయ్యారు. గతంలో అన్న ప్రసాదంలో వడ ఉండేది కాదు. ఆయన వచ్చాక మెనూలో మార్పులు చేశారు. కొత్తగా గారెను కూడా వడ్డిస్తున్నారు.
TTD Chairman Comments
తాజాగా టీటీడీ (TTD) చైర్మన్ బీఆర్ నాయుడు ఆకస్మికంగా వెంగమాంబ అన్నదాన కేంద్రం వద్దకు వెళ్లారు. అక్కడి పరిసరాలను పరిశీలించారు. భక్తులకు వడ్డిస్తున్న అన్న ప్రసాదం, కూరగాయాలను తనిఖీ చేశారు. అన్నప్రసాద కేంద్రంలో భక్తులతో కలిసి అన్న ప్రసాదం స్వీకరించారు బీఆర్ నాయుడు.
ఈ సందర్భంగా పలువురు భక్తులు చైర్మన్‌తో మాట్లాడుతూ అన్న ప్రసాదంలో అందిస్తున్న అన్నం చాలా మృదువుగా, వంటకాలు రుచికరంగా ఉన్నాయని సంతోషం వ్యక్తం చేశారు. ప్రత్యేకంగా రాత్రి భోజనంలో వడను వడ్డించడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ చైర్మన్‌కు ధన్యవాదాలు తెలిపారు.
అన్నప్రసాద వితరణ వ్యవస్థపై సంతృప్తి వ్యక్తం చేసిన చైర్మన్, భక్తుల నుండి ఎలాంటి ఫిర్యాదులు లేకుండా, ఎల్లప్పుడూ రుచికరమైన అన్నప్రసాదాన్ని అందించేలా నిరంతరం పరిశుభ్రతతో కూడిన వంటకాలను సిద్ధం చేసి అందించాలని సంబంధిత అధికారులకు ఆదేశించారు. టీటీడీ (TTD) బోర్డు సభ్యులు పనబాక లక్ష్మీ, జంగా కృష్ణమూర్తి, శాంతా రామ్, నరేష్ కుమార్, జానకీ దేవిలు కూడా చైర్మన్ తో పాటు భక్తులతో కలిసి అన్న ప్రసాదం స్వీకరించారు. ఈ కార్యక్రమంలో అన్న ప్రసాదం డిప్యూటీ ఈ వో రాజేంద్రకుమార్ కూడా ఉన్నారు.
Also Read : శ్రీరంగం నుండి శ్రీవారికి పట్టు వస్త్రాలు సమర్పణ



















