అమరావతి : హరిశ్చంద్రపురం రైల్వే స్టేషన్ ద్వారా పలు రైళ్లు వెళుతున్నాయని, ఇక్కడి నుంచి ప్రతి నిత్యం వేలాది మంది ప్రయాణీకులు ఇతర ప్రాంతాలకు వెళుతుంటారని ఇక్కడ ప్రధాన రైళ్లు ఆపాలని కోరారు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు. తిలారు రైల్వే స్టేషన్‌లో బ్రహ్మపూర్ – విశాఖపట్నం రైలు సర్వీసు నూతన హాల్ట్‌ను కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడుతో కలిసి ప్రారించడం ఆనందంగా ఉందన్నారు. ఈ సందర్భంగా హరిశ్చంద్రపురం రైల్వే స్టేషన్‌ను అభివృద్ధి చేయాలని కోరారు. స్థానిక ప్రయాణికుల అవసరాల దృష్ట్యా కీలకమైన రైళ్లను అక్కడ నిలుపుదల చేయాలని కేంద్ర మంత్రికి వినతి పత్రం అందజేశారు.
గుణుపూర్ ఎక్స్‌ప్రెస్, భువనేశ్వర్-విశాఖపట్నం ఇంటర్‌సిటీ, పూరీ-తిరుపతి ఎక్స్‌ప్రెస్, విశాఖ ఎక్స్‌ప్రెస్ సర్వీసులను హరిశ్చంద్రపురంలో ఆపాలని కోరడం జరిగిందని చెప్పారు రాష్ట్ర మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు.స్టేషన్‌లో ప్రయాణికులకు అవసరమైన కనీస సౌకర్యాలను మెరుగు పరచాల్సిన అవసరం ఉందన్నారు. స్టేషన్ సమీపంలోని 40 ఎకరాల ప్రభుత్వ స్థలంలో రైల్వే గొడౌన్లు లేదా ఆర్పీఎఫ్ క్వార్టర్స్ నిర్మించడం ద్వారా స్థానికులకు ఉపాధి, రైల్వేకు ఆదాయం లభించేలా చర్యలు తీసుకోవాలని విన్నవించినట్లు తెలిపారు అచ్చెన్నాయుడు.
ఈ అంశాలపై రైల్వే డీఆర్ఎం లలిత్ బోహ్రా సానుకూలంగా స్పందించడం సంతోషంగా ఉందన్నారు. మన ప్రాంత ప్రయాణికుల కష్టాలను తీర్చి, హరిశ్చంద్రపురం స్టేషన్ రూపురేఖలు మార్చే వరకు కృషి చేస్తాం అని ప్రకటించారు.















