US-India : భారత్-అమెరికా మధ్య వాణిజ్య ఒప్పందంపై చర్చలు ఈరోజు (మంగళవారం) న్యూఢిల్లీలో జరుగనున్నాయి. అమెరికా ఇటీవల భారత వస్తువులపై 50 శాతం దిగుమతి సుంకాలు విధించిన నేపథ్యంలో, ఈ సమావేశం మరింత ప్రాధాన్యం సంతరించుకుంది.
US-India – చర్చలలో ఎవరు?
అమెరికా (US) తరఫున బ్రెండన్ లించ్ చర్చలకు నాయకత్వం వహిస్తున్నారు. ఆయనే సౌత్ ఆసియా, సెంట్రల్ ఆసియాలోని 15 దేశాలతో అమెరికా వాణిజ్య విధానాలను సమన్వయం చేస్తారు. భారత్ (India) తరపున వాణిజ్య మంత్రిత్వ శాఖ సీనియర్ అధికారి రాజేష్ అగర్వాల్ పాల్గొంటున్నారు. అగర్వాల్ మాట్లాడుతూ, ఇవి సాధారణ రౌండ్ చర్చలు కాకుండా, రెండు దేశాల మధ్య ఒప్పందం సాధ్యాసాధ్యాలను పరిశీలించే కీలకమైన చర్చలని స్పష్టం చేశారు.
గత చర్చల నేపథ్యం
ఇప్పటివరకు భారత్-అమెరికా మధ్య ఐదు రౌండ్‌ల చర్చలు జరిగాయి. ఆరవ రౌండ్ ఆగస్ట్ 25-29 మధ్య జరగాల్సి ఉన్నా, అమెరికా సుంకాల నిర్ణయం కారణంగా వాయిదా పడింది. అయితే, ఇటీవల అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్-అమెరికా వాణిజ్య సంబంధాలపై సానుకూల వ్యాఖ్యలు చేయగా, ప్రధాని నరేంద్ర మోదీ కూడా సానుకూల స్పందన వ్యక్తం చేశారు.
మోదీ ఈ చర్చలు రెండు దేశాల మధ్య అపారమైన అవకాశాలను తెరుస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. గత కొన్ని వారాలుగా ట్రంప్ విధానాల కారణంగా ఉద్రిక్తత నెలకొన్నప్పటికీ, ఇప్పుడు సంబంధాలు కొంత మెరుగవుతున్నాయన్న సంకేతాలు కనిపిస్తున్నాయి. ట్రంప్ వరుసగా మోదీని పొగడటం, బాండింగ్‌ను బలోపేతం చేయాలన్న దృక్పథం వ్యక్తం చేయడం, రెండు దేశాలూ ఒక నిర్ణయాత్మక ఒప్పందం వైపు కదులుతున్నాయన్న సూచనగా భావించవచ్చు.
వివాదం వెనుక కారణం
అమెరికా భారత్ నుంచి దిగుమతి అయ్యే వస్తువులపై విధించిన 50 శాతం సుంకం ప్రధానంగా రష్యా నుంచి చమురు దిగుమతుల కారణంగా పెరిగింది. అందులో 25 శాతం నేరుగా చమురు సంబంధిత విధానాలకే చెందినది. ఇది ప్రపంచంలోనే అత్యధిక సుంకాల్లో ఒకటిగా పరిగణించబడుతోంది. భారత్ ఈ నిర్ణయాన్ని అన్యాయం, అసమంజసం అని విమర్శిస్తోంది. రష్యా నుంచి చమురు కొనుగోలు చేయడం వెనుక దేశ ఆర్థిక ప్రయోజనాలు ఉన్నాయని భారత్ స్పష్టంగా తెలియజేస్తోంది.
Also Read : ITR Deadline Shocking : మరోసారి ఐటీఆర్ ఫైలింగ్ పొడిగించిన సర్కార్



















