హైదరాబాద్ : జాతీయ ఉపాది హమీ చట్టం పథకంకు సంబంధించి మహాత్మా గాంధీ పేరును కేంద్రం తొలగించడాన్ని తీవ్రంగా నిరసిస్తూ శనివారం హైదరాబాద్ లో ఆందోళన చేపట్టారు. ఎంజీ రోడ్‌లోని గాంధీ విగ్రహం వద్ద నిర్వహించిన నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు రాష్ట్ర సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి మొహమ్మద్ అజారుద్దీన్ , టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ , ఏఐసీసీ జాతీయ కార్యదర్శి సంపత్ కుమార్ , ఎమ్మెల్యేలు హాజరయ్యారు. జాతీయ ఉపాధి హామీ చట్టం పథకం నుంచి మహాత్మా గాంధీ గారి పేరును తొలగించడాన్ని తీవ్రంగా ఖండించారు మంత్రులు జూపల్లి కృష్ణారావు, అజారుద్దీన్. ఇది మంచి పద్దతి కాదన్నారు.
అధికారం ఉంది కదా అని కేంద్ర ప్రభుత్వం దుర్మార్గమైన నిర్ణయం తీసుకుందని మండిపడ్డారు. ప్రతి భారతీయుని గౌరవం దెబ్బ తీసేలా తీసుకున్న నిర్ణయాన్ని కేంద్రం వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు . లేనిపక్షంలో దేశ వ్యాప్తంగా ఆందోళనను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. అట్టడుగు పేద ప్రజలు కరువు కాటకాల్లో ఉన్నపుడు కాంగ్రెస్ తీసుకున్న గొప్ప పథకాన్ని నిర్వీర్యం చేసేందుకు బీజేపీ ప్రభుత్వం కంకణం కట్టుకుందని ఆవేదన వ్యక్తం చేశారు. సోనియా, రాహుల్ మీద కోపంతో ఇలాంటి నిర్ణయాలు తీసుకోవడం సరికాదని హితవు పలికారు. పార్లమెంట్‌లో ఈ చట్టం వెనక్కి తీసుకొనేంత వరకూ పల్లెలు ఏకం కావాల్సిన అవసరం ఉందన్నారు జూపల్లి, అజారుద్దీన్.
