ముంబై : ఐసీసీ టి20 వరల్డ్ కప్ కు ఇంకా ఒకే ఒక్క అడుగు దూరంలో ఉంది సూర్య కుమార్ యాదవ్ సారథ్యంలోని భారత జట్టు. కోల్ కతా వేదికగా జరిగిన క్వార్టర్ ఫైనల్ లో విండీస్ ను 5 వికెట్ల తేడాతో ఓడించి సెమీ ఫైనల్ కు చేరుకుంది టీమిండియా. ఒకానొక దశలో గెలవదేమోనని అనుకున్న భారత్ ను ఒంటిచేత్తో గెలిపించాడు కేరళ స్టార్ క్రికెటర్ సంజూ శాంసన్. తను 50 బంతుల్లో 97 రన్స్ చేసి నాటౌట్ గా నిలిచాడు. ఇక సెమీ ఫైనల్ లో భాగంగా జరిగిన కీలక మ్యాచ్ లో కీవీస్ ఊహించని విధంగా 9 వికెట్ల తేడాతో సౌతాఫ్రికాను మట్టి కరిపించింది.
ఇక రెండో సెమీ ఫైనల్ మ్యాచ్ కు సిద్దమైంది భారత జట్టు. గురువారం ముంబైలోని వాంఖడే స్టేడియం వేదికగా ఇంగ్లండ్ జట్టుతో తలపడనుంది. ఇరు జట్లు బలాల పరంగా చూస్తే ఆల్ రౌండ్ షో ప్రదర్శించేందుకు రెడీ అయ్యాయి. అత్యుత్తమ ప్రదర్శన చేసేందుకు ఇరు జట్ల ఆటగాళ్లు సిద్దమై ఉన్నారు. నిన్న మైదానంలో భారత ఆటగాళ్లు చెమటోడ్చారు. అందరి కళ్లు ఇప్పుడు సంజు శాంసన్ మీదే ఉన్నాయి. మరో వైపు అభిషేక్ శర్మ ఈ టోర్నీలో ఆశించిన రీతిలో ఆడలేక పోయాడు. జింబాబ్వేతో హాఫ్ సెంచరీ చేసినా కీలకమైన విండీస్ తో నిరాశ పరిచాడు. ఇక తొలి వికెట్ నుంచి ఆఖరి వికెట్ వరకు టీమిండియా ప్లేయర్లు బ్యాట్ ను ఝులిపించ గలరు. ఇక బౌలింగ్ పరంగా మరింత రాటు దేలాల్సి ఉంది.
